గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (10:35 IST)

బెంగాల్‌లో విషాదం - విద్యుదాఘాతానికి 10 మంది కన్వర్ యాత్రికుల మృతి

deadbody
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రక్కు విద్యుదాఘాతానికి గురైంది. దీంతో 10 మంది కన్వర్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కులో జల్పేష్ వెళుతుండగా కూచ్ బెహార్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీనికి జనరేటర్ వైర్లే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
గాయపడిన వారిలో 16 మందిని మెరుగైన వైద్య సేవల కోసం జల్పాయ్‌గురి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రక్కులో డీజే సిస్టం కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వైరింగ్ కారణంగానే విద్యుదాఘాతం సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
మేఖ్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధార్లా బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగిందని మఠభంగ అడిషినల్ ఎస్పీ అమిత్ వర్మ తెలిపారు. కన్వర్ భక్తులంతా సీతల్‌కుచి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేశామని, డ్రైవర్ పరారీలో ఉన్నారని అమిత వర్మ వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.