శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:00 IST)

ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 25 లక్షల మంది మరణించారు. 2019 డిసెంబరులో తొలి కేసు వెలుగు చూసిన తర్వాత ఇప్పటివరకు 25,00,172 మంది మరణించగా, మొత్తంగా 11,26,18,488 కేసులు నమోదయ్యాయి.

ఇందులో 8,42,894 మరణాలతో యూరప్‌ తీవ్రంగా దెబ్బతిని మొదటి స్థానంలో వుండగా, రెండో స్థానంలో లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ ప్రాంతం (6,67,972 మృతులు) వుంది. ఇక అమెరికా, కెనడాల్లో కలిపి 5,28,039 మరణాలతో మూడో స్థానంలో వుంది.

ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో దాదాపు సగం మరణాలు కేవలం ఐదు దేశాల్లోనే సంభవించాయి. అమెరికా(5,06,232), బ్రెజిల్‌(2,49,957), మెక్సికో(1,82,815), భారత్‌(1,56,705), బ్రిటన్‌(1,22,070) వున్నాయి.
తొలి కేసు నమోదైన 9 మాసాల తర్వాత అంటే గతేడాది సెప్టెంబరు 28 నాటికి పది లక్షల మరణాలు నమోదయ్యాయి.

మరో నాలుగు నెలలు గడిచేప్పటికి అంటే జనవరి 15 నాటికి 20 లక్షల మరణాలు సంభవించాయి. ఈ ఏడాది జనవరి తర్వాత మరణాలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. గత వారంలో 66,800 అంటే రోజుకు సగటున 9,500 మరణాలు నమోదయ్యాయి.

జనవరి 20 నుండి 26 వరకు ఆ వారం రోజుల కాలంలో 1,01,400 మరణాలు చోటు చేసుకుని అత్యంత భయంకరమైన వారంగా నమోదైంది. అంటే రోజుకు 14,500 మంది చనిపోయారు. నవంబరు మొదట్లో వున్న పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తోంది.

గత వారం రోజుల్లో మొత్తంగా ప్రపంచ మరణాల్లో మూడో వంతు యూరప్‌లోని 52 దేశాల్లో సంభవించాయి. ఇతర ఖండాల్లో మరణాల రేట్లు తగ్గాయి. అమెరకా, కెనడాల్లో 23 శాతం తగ్గి రోజుకు 2,150 మరణాలు సంభవిస్తున్నాయి.