మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2020 (20:04 IST)

జగన్ చొరవతో రాష్ట్రంలో కరోనా మరణాలు తగ్గించాం: ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని

రాబోయే కరోనా కాలం వైద్యఆరోగ్య శాఖకు చాలా కీలకమని డిప్యూటి సిఎం,రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సోమవారం రాష్ట్రంలోని సంయుక్త కలెకర్లు, వైద్యఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు.

కరోన వైరస్  ప్రపంచాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కరోన నివారణకు వైద్యఆరోగ్యశాఖ చేసిన కృషి,భవిష్యత్తు ప్రణాళికపై ప్రధానంగా మంత్రి చర్చించారు. భారతీయ వైద్య మండలి (ఐసిఎంఆర్) ఆదేశాల మేరకు కరోనా రెండో దశ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సూచించడంతో వైద్య ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తంగా పని చేయాలని మంత్రి ఆదేశించారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందస్తు ఆదేశాల మేరకు కరోన నియంత్రణా చర్యలు తీసుకున్న నేపథ్యంలో, రాష్ట్రంలో మరణాల సంఖ్యను తగ్గించ గలిగామని మంత్రి నాని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కరోన కట్టడికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందుగా అప్రమత్తం చేసిన తీరుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు.

వైద్యఆరోగ్యశాఖ అధికారులు కూడా కరోన కట్టడికి సమర్ధవంతంగా పనిచేశారని మంత్రి  అభినందించారు. కరోన కట్టడికి సిఎం జగన్ అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు అందిస్తూ, ఎక్కడా  సమస్యలు తలెతకుండా చర్యలు తీసుకున్నారన్నారు.కరోన నిర్ధారణ పరీక్షలు విషయంలో పలురకాల టెస్టింగ్ కిట్లను ఉపయోగించామన్నారు.

కరోనా ఫలితాల కోసం ఇతర రాష్ట్రాలకు  వెళ్ళకుండా టెస్టింగ్ సెంటర్ల ను ఏర్పాటు చేసి  త్వరిత గతిన ఫలితాలు వచ్చేలా కృషి చేశామన్నారు.కరోన ప్రారంభ దశ నుంచి కేసుల సంఖ్యను పరిశీలిస్తే  ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గడాన్ని బట్టి వైద్య ఆరోగ్యశాఖ పనితీరు అర్ధమవుతుందన్నారు.

ఒకదశలో కరోన కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల సంఖ్యను తగ్గించడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమర్ధవంతంగా పనిచేశారని మంత్రి కొనియాడారు.రాష్ట్ర వ్యాప్తంగా కరోన పరీక్షలు అధిక సంఖ్యలో చేయడం ద్వారా పాజిటీవ్ కేసులను గుర్తించి,రోగులకు సత్వర సేవలను అందించ గలిగామన్నారు. అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువగా కరోన టెస్ట్ లు చేశామని పేర్కొన్నారు.

అన్ని ఆసుపత్రులలో తగినంతగా ఆక్సిజన్ సిలెండర్లు,బెడ్లు అందుబాటులో ఉంచామని వెల్లడించారు.కరోనా రోగులను అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలిచి,ఆదుకుందని మంత్రి నాని స్పష్టం చేశారు.మిగతా రాష్ఠ్ర్టాల కన్నా మెరుగ్గా మరో అడుగు ముందుకు వేసి కరోనా రోగులకు ఆర్ధిక సాయం అందించడం  జరిగిందని అన్నారు.
 
హోం ఐసోలేషన్ ద్వారా చికిత్సలు... 
కరోన ప్రభావం తక్కువగా ఉన్నవారు,హోం ఐసోలేషన్ ద్వారా చికిత్సలు తీసుకుంటున్న తరుణంలో ఉచితంగా  మందులు(కిట్స్) అందించి,పర్యవేక్షించడం వంటి కీలక విషయాలపై దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.నిరంతరం కరోనా రోగులకు తగిన సూచనలు చేస్తూ నియంత్రణకు తీసుకున్న చర్యలు  బాగున్నాయన్నారు.

భవిష్యత్తుల్లో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.ఇప్పటి వరకు కరోన  వైద్యసేవలు పొందిన రోగుల వివరాల తోపాటుగా చికిత్సపొందుతున్న వారి స్థితిగతులపై ఆరాతీశారు.
 
రెండో దశ కీలకం... 
భారతీయ వైద్య మండలి ఆదేశాల మేరకు కరోనాను రెండవ దశలో  పూర్తి స్థాయిలో మరింత  సమర్ధ వతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి ఆళ్ళ నాని స్పష్టం చేశారు.కరోన కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం,చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని మంత్రి సూచించారు.ఆరోగ్యశ్రీ పధకాన్ని రాష్ట్రంలో సమర్ధవంతంగా అమలు చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న దృష్ట్యా, అంటు వ్యాధులు ప్రబలకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పారిశుద్ధ్యం,తాగునీరు సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు,కళాశాలలు,సినిమా హాళ్ళు,వ్యాపార కేంద్రాలు తదితర కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  కరోనా కట్టడికి నిరంతర ప్రచారం చేయాలన్నారు.

ప్రజల్లో అవగాహన కల్పిచడం,ఆయా నిర్వాహాకులు కరోన నియంత్రణకు అనుసరిస్తున్నతీరును పరిశీలన చేయాలని మంత్రి స్పష్టం చేశారు.ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి ఆదేశాలిచ్చారు. ఎక్కడైనా అధికారులు,సిబ్బంది నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామన్నారు. 
 
ఆరోగ్యశ్రీ పై సుదీర్ఘ చర్చ ... 
రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాలలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలవుతున్న తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఎంపానెల్ హాస్పిటల్  కింద నమోదు అయ్యి గ్రేడ్ లు గా మార్చిన విధానాన్ని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆసుప్రతులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని అధికారులు మంత్రికి తెలిపారు.

ఆసుపత్రుల నిర్వహణలో తలెత్తున్న లోపాలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.ఎక్కడైనా ప్రజలు,రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఎడల చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.నింబంధనలకు అనుగుణంగా ఆసుప్రతులు పనిచేసేలా చూడాలన్నారు.త్వరిత గతిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు,సిబ్బందిని నియమించాలన్నారు.దీంతో పాటుగా ఆరోగ్యశ్రీ అమల‌వుతున్న ఆసుపత్రుల్లో ఆరోగ్య శాఖ కో ఆర్డినేటర్లు, ఆరోగ్య మిత్రలు పనితీరును అడిగి తెలుసుకున్నారు.

సమర్ధవంతంగా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పధకం అమలు చేయడం ద్వారా, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం (సిఎంఆర్ఎఫ్) ఎదురు చూడకుండా చూడలని అన్నారు.ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు వైద్యసేవలు ఉపయోగించుకునేలా ఛైతన్య పరచాలన్నారు.వైయస్ఆర్ కంటి వెలుగు మూడో విడతలో వృద్ధులకు మెరుగైన వైద్యసేవలను అందించాలన్నారు.

వైఎస్సార్ వార్డు, గ్రామ హెల్త్ క్లినిక్స్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో వైద్య సేవలు, మెడికల్ కాలేజ్ లు ఏర్పాటువంటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సుదీర్భంగా చర్చించారు.రాబోయే పదిహేను రోజుల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.అధికారులు నిర్ధిష్ట ప్రణాళికలను తయారు చేసుకొని పని చేయాలని మంత్రి ఆళ్ళ నాని సూచించారు.

వీడియో కాన్ఫిరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, కమిషనర్ కాటంనేని భాస్కర్, డైరెక్టర్ అఫ్ మెడికల్ అండ్ ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ అరుణ కుమారి, ఆరోగ్య శ్రీ సీఈఓ డాక్టర్ మల్లికార్జున, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు,13 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వైద్యఆరోగ్యశాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.