బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (21:20 IST)

కోస్తాంధ్ర అతలాకుతలం.. జ‌గ‌న్‌కు మోదీ ఫోన్‌

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో తూర్పుగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాలు వణికిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో కొంతమేర వర్ష ప్రభావం తగ్గింది. జనజీవనానికి కాస్త ఊరట దొరికింది.

వర్షాలతో రాజమహేంద్రవరంలోని కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోటిపల్లి బస్టాండ్‌, ఐఎల్‌టీడీ జంక్షన్‌, కంబాల చెరువు, రైల్వేస్టేషన్‌ రోడ్డు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాత్రి నుంచి కురిసిన వానకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది.

బొమ్మూరులో గోడ కూలి ఓ మహిళ మృతి చెందారు. తునిలో తాండవ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోటనందూరు, కొట్టాం, తుని, కొలిమేరు రోడ్లపై నీరు చేరింది. పూరిళ్లు ధ్వంసమయ్యాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వర్షం కారణంగా రావులపాలెం బస్టాండ్‌ చెరువును తలపిస్తోంది.

కాకినాడ, ఉప్పాడ తీరంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత గ్రామాల్లో కొన్ని ఇళ్లు కోతకు గురయ్యాయి. జగ్గంపేటలో ఎస్సీ కాలనీని నీరు చుట్టుముట్టింది. మురుగుకాల్వల నీరు రోడ్లపైకి చేరి అస్తవ్యస్తంగా మారింది.
 
వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు
పశ్చిమగోదారివరిపైనా తీవ్రవాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. జంగారెడ్డి గూడెం, బుట్టాయగూడెం, టీ నర్సాపురం, తడిగెలపూడి, గోపాలపురం, కొయ్యలగూడెం, కొవ్వూరు, పోలవరం మండలాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

జంగారెడ్డి గూడెం మండలం పట్టన్నపాలెంలో జల్లేరువాగు పొంగి ప్రవహిస్తోంది. బైనేరు, సుద్దవాగు, ఎర్రకాలువ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఎర్రకాలువ జలాశయం నుంచి 15వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం, జంగారెడ్డి గూడెం, కొయ్యలగూడెం మండలాల్లో వేల ఎకరాల్లో వరి, పొగాకు నారు మళ్లు దెబ్బతిన్నాయి. తడికెల పూడిలో చేపల వేటకు వెళ్లి వాగులో పడి 55 సంవత్సరాల వ్యక్తి గల్లంతయ్యారు.
 
పాములు, విషపురుగులతో భయం భయం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాట్రాయి మండలంలో కురిసిన భారీ వర్షాలకు రహదారులపై వరద ప్రవహిస్తోంది. జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది.

తిరువూరులో లోతట్టు ప్రాంతాలు, నివాస గృహాలు ముంపునకు గురయ్యాయి. బాపులపాడు మండలం కొత్తపల్లిలో ప్రధాన రహదారులు జలదిగ్బంధమయ్యాయి. నూజివీడు మండలం యనమదలో మోకాళ్ల లోతు నీరు చేరింది. వరదతో విషపురుగులు, పాములు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హనుమాన్‌ జంక్షన్‌లో భారీ వర్షం కురిసింది. వర్షపునీటితో 16వ నంబరు జాతీయ రహదారిపై భారీగా నీరు చేరింది.

విజయవాడ శివారు రాజీవ్‌నగర్‌ కట్ట సమీపంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సమీపంలోని బుడమేరు కాల్వ పొంగడంతో వరదనీరు ఇళ్లలోకి చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశ్‌నగర్‌, ఎల్వీఎస్‌నగర్‌లో రెండు అడుగుల మేర వరద నీరు చేరింది. బుడమేరు వరద తగ్గితేనే మోటార్లు పెట్టి నీరు తోడుతామని అధికారులు చెబుతున్నారు.

ఏపీలో భారీ వ‌ర్షాల‌కు పంట న‌ష్టం
ఏపీలో భారీ వ‌ర్షాల‌కు 1,79,553 ఎకరాల్లో పంట న‌ష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే అన్ని జిల్లాల కంటే ఎక్కువగా ఉభ‌య గోదావ‌రి జిల్లాలు చ‌విచూసినట్టు చెబుతున్నారు.  తొమ్మిది జిల్లాల్లో 24 ర‌కాల పంట‌ల‌కు న‌ష్టం కలిగినట్టు చెబుతున్నారు.

వ‌రి, ప‌త్తి, మినుము పంట‌లు భారీగా  న‌ష్ట‌పోయినట్టు సమాచారం. 1,36,735 ఎకరాల్లో వ‌రి పంట నష్టం జరగగా, 30,118 ఎకరాల్లో ప‌త్తి పంట న‌ష్టం జరిగింది, అలానే 4000 ఎకరాల్లో మినుము పంటకు న‌ష్టం జరిగింది. అలానే క‌డ‌ప జిల్లాలో ఇసుక మేట‌లు, భూమి కోత‌తో పంట‌ల‌కు భారీగా న‌ష్టం చేకూరింది.

ఒక్క తూ.గో జిల్లాలోనే 74,857 ఎకరాల్లో పంట నష్టం జరగగా, ప.గో జిల్లాలో 34,940 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అలానే కృష్ణాలో కూడా 31, 165 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది.
 
జ‌గ‌న్‌కు మోదీ ఫోన్‌
ప్రధాని నరేంద్ర మోదీ ఏపి సీఎం వైయస్ జగన్‌కు ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, అనంతర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాలు, నెలకొన్న పరిస్థితులను ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ ప్రధానికి వివరించారు. వాయుగుండం తీరం దాటిందని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంటూ ఈ సంద‌ర్భంగా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు.