ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా పునాదిపాడు జడ్పీ హైస్కూలులో నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ వస్తువులతో కూడిన కిట్లను ముఖ్యమంత్రి జగన్ అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పాఠశాలల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహించేలా విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సూచనల మేరకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా ప్రోత్సహించి చేరికలు పెంచడంతోపాటు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు అందచేసే వస్తువుల నాణ్యతపై ఎక్కడా రాజీ పడకుండా ముఖ్యమంత్రే స్వయంగా అన్నిటినీ పరిశీలించి ఆమోదించడం విశేషం.
42.34 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ : రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్ధులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో ‘స్టూడెంట్ కిట్లు’ అందచేస్తారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్లు పంపిణీ చేస్తారు.
ఈ కిట్లలో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ ఉంటాయి. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందిస్తారు. కోవిడ్ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేస్తారు.
కిట్ల పంపిణీ ఇలా :
రోజూ 50 మందికి మించకుండా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, సంరక్షకులతో కలసి పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టి కిట్లను అందచేయాలి. కిట్ అందుకున్న తల్లులతో బయో మెట్రిక్, ఐరిష్ ద్వారా హాజరు నమోదు చేయాలి. కిట్‌లలో వివిధ తరగతుల విద్యార్థుల కోసం పలు వస్తువులు అందచేస్తున్నందున ఎక్కడైనా సరైన సైజువి లేకపోయినా, లోపాలు ఉన్నట్లు గుర్తించినా అధికారులకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించాలి.
యూడైస్ కోడ్ , చైల్డ్ ఇన్ఫోలో నమోదైన వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికి అన్ని వస్తువులు అందజేయనున్నారు. జగనన్న విద్యాకానుక’కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 91212 96051, 91212 96052 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
మూడు రోజుల్లో విద్యార్థులందరికీ కిట్లు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలోని పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్టోబరు8న (గురువారం) ప్రారంభం కానుందని పాఠశాల విద్యాశాఖా సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు.
‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రాష్ట్రంలో 42, 34, 322 మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారని తెలిపారు.
ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్కు బుక్స్, 6 నుంచి 10 వతరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగుతో పాటు ‘స్టూడెంట్ కిట్’ గా ఇస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యా సంచాలకులు జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఎలాంటి అపోహలు పడొద్దు
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో పిల్లల ఆరోగ్య భద్రతా దృష్ట్యా, ప్రభుత్వ ఆదేశాలు మేరకు భౌతిక దూరం పాటిస్తూ ప్రతి పాఠశాలలో వరుసగా మూడు రోజుల్లో కిట్లు పంపిణీ చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు తెలిపారు. ‘మాకు అందలేదని’ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళన చెందవద్దని కోరారు. యూడైస్, చైల్డ్ ఇన్పోలో ఉన్న వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ‘జగనన్న విద్యా కానుక’ కిట్ అందుతుందని పేర్కొన్నారు.
గురుకుల పాఠశాలల్లో, కేజీబీవీలలో, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు చెందిన కిట్లు ఇప్పటికే ఆయా పాఠశాలలకు అందాయని తెలిపారు. విద్యార్థులు ఈలోపు పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా లేదా, పాఠశాలకు స్వయంగా వెళ్లి తీసుకోవాలని కోరారు.
‘జగనన్న విద్యా కానుక’ కిట్ లో బ్యాగు కానీ, షూ కానీ, బెల్టు, యూనిఫాం వంటి వాటిల్లో సరైన సైజు రాకపోయినా, డ్యామేజ్ ఉన్నా, ఆ సమయానికి అందుబాటులో లేకపోయినా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళన చెందవద్దని తెలియజేసి, వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ని లేదా మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలని కోరారు.
కిట్ తీసుకునేటప్పుడు విద్యార్థి బయెమెట్రిక్, ఐరిష్ హాజరుకు సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఎదురైతే జగనన్న విద్యాకానుక’కు సంబంధించిన 91212 96051, 91212 96052 హెల్ప్ లైన్ నంబర్లను పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు సంప్రదించాలని కోరారు.