శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (22:19 IST)

కేసుల మాఫీ కోసమే హస్తిన చుట్టూ చక్కర్లు.. వంగి వంగి నమస్కారాలు : తెదేపా ఎంపీ

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ సెటైరికల్ విమర్శలు చేశారు. పదుల సంఖ్యలో ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారంటూ ఆరోపించారు. అందుకే, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. 
 
ఇటీవల వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఢిల్లీ పర్యటనపై కనకమేడల మాట్లాడుతూ, వ్యక్తిగత అజెండాతోనే జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగిందని ఆరోపించారు. ప్రధాని, హోంమంత్రితో సమావేశాల్లో జగన్ తన భవిష్యత్ గురించే మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.
 
కోర్టు విచారణలు, కేసుల నుంచి బయటపడేందుకు జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారని, అందుకే తన ఢిల్లీ సమావేశాల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారని కనకమేడల వ్యాఖ్యానించారు. కేసుల నుంచి బయటపడేందుకు జగన్ మడమతిప్పేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఫణంగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి... అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
అంతేకాకుండా, ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది, ఇప్పటివరకు రాష్ట్రం కోసం ఒక నిరసన గానీ, ఒక డిమాండ్ గానీ చేశారా? అని ప్రశ్నించారు. ఎంతసేపూ తమను కేసుల నుంచి బయటపడేయాలని, రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ విచారణ జరగాలని మాత్రమే జగన్ కోరుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిని వ్యతిరేకించడం ద్వారా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టంలేదని ప్రతిపక్ష నేతగా చెప్పిన మాటలను జగన్ మర్చిపోయారా..? అంటూ టీడీపీ ఎంపీ సూటిగా ప్రశ్నించారు.