శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (15:22 IST)

హల్లో జగన్‌ రెడ్డి.. 2 కేబినెట్ - ఒక ఇండిపెండెంట్ పదవి ఓకేనా? సీఎంతో పీఎం మోడీ??

ఢిల్లీ పిలుపు మేరకు 11 మంది నేతల బృందంతో అత్యవసరంగా హస్తినకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య ఏకంగా 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎన్డీయేలో చేరే విషయంపైనే చర్చ జరిగినట్టు ఢిల్లీ వర్గాల భొగొట్ట. ముఖ్యంగా, కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరేందుకు సమ్మతిస్తే రెండు కేబినెట్, ఒక ఇండిపెండెంట్ మంత్రి పదవిని ప్రధాని మోడీ ఆఫర్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
నిజానికి ప్రస్తుతం బీజేపీకి, వైసీపీకి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీ స్థాయిలో మాత్రం మంచి సంబంధాలు ఉన్నాయి. అదేసమయంలో కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరితే టీడీపీ అధినేత చంద్రబాబుకు చెక్ పెట్టడం, ఇదే సమయంలో బీజేపీతో కలిసి ముందుకు సాగవచ్చనే భావనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. 
 
మరోవైపు ఎన్డీయేలో వైసీపీ చేరితో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇంకోవైపు ఎన్డీయేలో వైసీపీ చేరితే... ఇప్పటివరకు బీజేపీకి మద్దతుగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. జగన్ ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయన ఏపీలో అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి ప్రకటన చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
 
మరోవైపు, ప్రధాని మోడీతో దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కరోనా పరిస్థితులు, విభజన హామీలు, రాష్ట్రానికి అందాల్సిన నిధులు, బకాయిలు వంటి అంశాలపై సీఎం జగన్ చర్చించారు. అలాగే, మొత్తం 17 అంశాలను జగన్ ప్రధానికి నివేదించారు. 
 
ప్రత్యేకంగా జీఎస్టీ చెల్లింపులు, రాష్ట్ర విభజన హామీలపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, దిశ సహా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ఏపీ బిల్లులపైనా ఆయన ప్రధానికి తెలియజేశారు. దాదాపు సీఎం జగన్ ప్రతిపాదనలన్నింటికీ ప్రధాని మోడీ నుంచి సానుకూల స్పందన వచ్చిందని సమాచారం. అలాగే, శాసనమండలి రద్దుపై కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. 
 
ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ అపెక్స్ కౌన్సిల్ భేటీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీ వాదనలు మరింత సమర్థంగా వినిపించేందుకు ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్ తదితరులు కూడా పాల్గొంటున్నారు.