బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (10:10 IST)

కోర్టులపై సీఎం జగన్ ఫిర్యాదు... ఇంకేంటి విషయాలంటూ ప్రధాని దాటవేత!

ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఏకంగా 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా కోర్టులపై ఫిర్యాదు అంశంతో పాటు.. రాష్ట్రానికి నిధుల ఇవ్వండంటూ సీఎం జగన్ మొరపెట్టుకున్నట్టు సమాచారం. 
 
హస్తిలో జరిగిన ఈ భేటీ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు... విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కోర్టు తనను పని చేసుకోనివ్వడంలేదంటూ సీఎం జగన్‌ న్యాయ వ్యవస్థపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరిన్ని సమస్యలు వివరిస్తుండగా... కొద్దిసేపు ప్రధాని నరేంద్ర మోడీ చిరునవ్వుతో ఆలకించారు. 
 
ఆ తర్వాత, సీఎం మాటలను అడ్డుకుని, 'ఇవన్నీ అమిత్‌ షాకు ఇప్పటికే చెప్పారు కదా! ఇంకేంటి విశేషాలు' అని అడిగినట్లు తెలిసింది. దీంతో, 17 అంశాలతో గతంలోనే సమర్పించిన ఒక వినతి పత్రాన్ని ప్రధానికి ఇచ్చారు. మంగళవారం ఉదయం 10.45 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో ఆయనతో జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి, ఇతర సమస్యలపై ఈ భేటీలో చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.