'ఆత్మనిర్భర భారత్' ద్వారా గాంధీ కలలు సాకారం.. మోదీ
జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి పూలమాలతో అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్న గాంధీజీ కలలను 'ఆత్మనిర్భర భారత్' ద్వారా సాకారం చేస్తామన్నారు. గాంధీజీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చెబుతూ ఆయన స్మృతులతో ఓ చిన్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
''అక్టోబర్-2 గాంధీజీ పుట్టిన రోజు మనందరికీ ఎంతో పవిత్రమైన, స్ఫూర్తిదాయకమైన రోజు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు ఇప్పటికీ బతికే ఉన్నాయి. నా జీవితమే నా సందేశం అని చెప్పారే తప్ప, తనని అనుసరించాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. కానీ, ఆయన జీవితం అందరికీ ఆదర్శమైంది.'' అని మోదీ అన్నారు. ప్రపంచమంతా ఓ కుటుంబమని గాంధీజీ నమ్మేవారని మోదీ చెప్పారు. సత్యం, అహింస ఆయుధాలుగా ఉద్యమాలను నడిపించారని గుర్తు చేశారు.
''దేశం ఆరోగ్యంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని దీని కోసం పరిశుభ్రత ముఖ్యమని గాంధీజీ చెప్పేవారు. గాంధీజీ ఆలోచనలు మాలో స్ఫూర్తి నింపాయి. అందుకే స్వచ్ఛభారత్ నినాదాన్ని అందుకున్నాం. సమాజాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఆయన మాటలు మాకు మార్గనిర్దేశం చేశాయి. గాంధీజీ ప్రభావం మాపై ఎంతైనా ఉందని బలంగా నమ్ముతున్నాను.'' అని మోదీ అన్నారు.