ప్రధాని మోడీ పర్సనల్ వెబ్‌సైట్ హ్యాక్
ప్రధాని నరేంద్ర మోడీకి చెందిన పర్సనల్ వెబ్‌సైట్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థ ద్రువీకరించింది. జాతీయ రిలీఫ్ ఫండ్‌కు క్రిప్టోకరెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వవచ్చు అని ఆ వెబ్‌సైట్ పేజీలో ట్వీట్లు కనిపించాయి. దీంతో ప్రధాని అకౌంట్ హ్యాక్ అయినట్లు ద్రువీకరించారు.
అయితే మోడీ అకౌంట్‌ను సెక్యూర్ చేసినట్లు కూడా ట్విట్టర్ సంస్థ వెల్లడించింది. ట్విట్టర్ సంస్థ ప్రతినిధి ఈ సంఘటనపై స్పందిస్తూ.. హ్యాకింగ్ గురించి తెలుసుకున్నామని, అకౌంట్‌ను మళ్లీ సెక్యూర్ చేశామని, ఈ సంఘటనను నిరంతరం దర్యాప్తు చేస్తున్నామని, అయితే ప్రధానికి చెందిన ఇతర అకౌంట్లపై ప్రభావం పడిందా అన్న విషయం తమకు తెలియదని అన్నారు. నరేంద్ర మోదీ(@narendramodi_in.) అకౌంట్‌పై పోస్టు చేసిన ట్వీట్లకు సంబంధించి ప్రధాని కార్యాలయం ఇంకా స్పందించలేదు.
ప్రధాని ట్విట్టర్ అకౌంట్‌కు సుమారు 2.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మోడీ పర్సనల్ వెబ్‌సైట్, నరేంద్ర మోడీ మొబైల్ అప్లికేషన్‌ను కూడా ఆ అకౌంట్ హ్యాండిల్ చేస్తుంది. ప్రధాని మోడీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ మాత్రం హ్యాక్ కాలేదన్నారు. దానికి సుమారు 61 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
క్రిప్టోకరెన్సీ పద్ధతితో విరాళాలు ఇవ్వాలంటూ వచ్చిన ట్వీట్లను ప్రస్తుతం తొలగించారు. ఇటీవలే అనేక మంది ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అకౌంట్‌ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. జూలై నెలలో టెక్నాలజీ దిగ్గజాలు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీల అకౌంట్లు హ్యాక్ అయ్యాయి.