లక్ష కోట్లు తినేసిన జగన్‌కు ప్రజలు ఓట్లు వేశారు: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లక్ష కోట్లు తినేసిన జగన్‌కు ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఏమి చేయాలో టీడీపీ ఆలోచించుకోవాలి' అని వ్యాఖ్యానించారు. అంతేగాక 'అలాంటప్పుడు ఏం చేయాలో టీడీపీ ఆలోచించుకోవాలని' సలహా కూడా ఇచ్చారు.
న్యాయవ్యవస్థపై జరుగుతున్న చర్చపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. జస్టిస్ రమణ విషయంలో ఆరోపణలు వ్యక్తిగతంగా నేను నమ్మనని పేర్కొన్నారు. రాజమండ్రిలో మీడియాతో శనివారం మాట్లాడిన ఆయన.. ‘‘జగన్ ముఖ్యమంత్రి కాక ముందు లక్ష కోట్ల రూపాయలు దోచేశారని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి నిందితుడుగా విచారణ జరగబోతోంది. రాజకీయ నాయకులపై కోర్టులో విచారణ జరిగినప్పుడు లైవ్ ఇవ్వాలి.
కోర్టులో విచారణ లైవ్ టెలీకాస్ట్ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఏపీని 15 సంవత్సరాలు పాటు పరిపాలించిన చంద్రబాబు కేసులు, నేటి ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న కేసులు విషయంలో లైవ్ టెలీకాస్ట్ చేయాలి. కోర్టులపై ముఖ్యమంత్రి లేఖ రాయటం ఇదేమీ కొత్త కాదు. గతంలో ముఖ్యమంత్రి సంజీవయ్య కూడా 1960లోనే కోర్టులపై లేఖ రాశారు. లేఖ రాయటం కంటే జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం తప్పా? రైటా అనే విషయం పైనే చర్చ జరుగుతోంది.
జగన్ అన్ని విషయాలలో మొండిగా వెళతారు. న్యాయవ్యవస్థలో లోపాలను రాజకీయ వ్యవస్థలు సరిదిద్దాలి. చట్టం ముందు జడ్జీలు అతీతులు కాదు. న్యాయవ్యవస్థలపై ఆరోపణలు విషయంలో చర్చ గౌరవంగా జరగాలి. న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మద్య విభేదాలు వస్తే ప్రజలకు నష్టం ప్రభుత్వం ఏ పని అయినా చట్టబద్దంగా చేయాలి.
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు ఎలా నిర్ధారిస్తారు? భూములు కొనుగోలు చేయకూడదా? తప్పా? అని ఒకరంటారు. ముఖ్యమంత్రి కొడుకు వ్యాపారం చేయకూడదా అనేది జగన్ వాదన’’ అని తెలిపారు.