ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (21:43 IST)

అవినీతి మంత్రిని జగన్ ఎందుకు కాపాడుతున్నాడు?: అయ్యన్న ప్రశ్న

ఇప్పుడున్నటువంటి దౌర్భాగ్యపు పరిపాలనను రాష్ట్రంలో తానెన్నడూ చూడలేదని, 16నెలల్లోనే వైసీపీప్రభుత్వం రాష్ట్ర ఆర్థికవ్యవస్థను, పోలీస్ వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిందని, ఆఖరికి న్యాయవ్యవస్థపైకూడా దాడికి దిగిందని,  టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు.

బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా ...!

జగన్ పాలనలో ఎక్కడాచూసినా అవినీతే రాజ్యమేలుతుందని, మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలు వైసీపీకార్యకర్తలవరకు అందరూ భూమాఫియాలో మునిగి తేలుతున్నా, ముఖ్యమంత్రి ఏనాడూ స్పందించలేదని, మంత్రులెవరినీ కనీసం మందలించడం కూడా చేయలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు హాయాంలో ప్రజాప్రతినిధులపై ఏవైనా ఆరోపణలు వస్తే వెంటనే స్పందించేవారు.

ఆరోపణలు వచ్చిన అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెప్పించుకొని, అధికారులతో వారు సమీక్ష జరిపేవారు. రాష్ట్రవ్యాప్తంగా తన కేబినెట్ లోని బెంజికారు మంత్రి అయిన జయరామ్ వ్యవహారంపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ప్రజల్లో, ప్రసారమాధ్యమాల్లో మంత్రి జయరామ్ భూదోపిడీపై చర్చ జరుగుతుంటే, కర్ణాటకలోని పోలీస్ స్టేషన్లో మంత్రిపై కేసునమోదైనా జగన్ ఎందుకు పట్టించుకోవడంలేదు? 

జగన్ అవినీతి మంత్రిని ఎందుకు కాపాడుతున్నాడో చెప్పాలి. మంత్రిపై చర్యలు తీసుకుంటే, ఎక్కడ తనఅవినీతి, తన ప్రభుత్వ అవినీతిని బయటపెడతాడేమోనన్న భయం జగన్ కు ఉందా? మంత్రి జయరామ్ భార్య పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదులో తమను మోసం చేసి, భూములు అమ్మారని చెప్పారు.

గతంలో మంత్రి మాట్లాడుతూ, రిజిస్ట్రార్ కార్యాలయంలో మాట్లాడానని, భూమికి సంబంధించిన వివరాలున్నాయని పక్కాగా ఉన్నాయని తెలిశాకే సదరు భూమిని కొన్నానని చెప్పారు. ఇప్పుడేమో ఆయన భార్య తమను మోసగించారని ఆంధ్రాలో ఫిర్యాదుచేసింది. ముఖ్యమంత్రి మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల, మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్ తమకు అవినీతి చేసుకోమని లైసెన్స్  ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. 

ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా సుమారు 6 నుంచి 7వేల ఎకరాల వరకు దోపిడీచేశారు. దానిపై ముఖ్యమంత్రి ఏంచర్యలు తీసుకున్నారు. తూతూ మంత్రంగా సిట్ వేసిన ప్రభుత్వం, దానికి సంబంధించిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు? ఆఖరికి విజయనగరంలోని సింహాచలం భూములను, మాన్సాస్ ట్రస్ట్ పరిధిలోని భూములనుకూడా వదలకుండా కాజేయాలని చూస్తున్నారు. ఇవేవీ ముఖ్యమంత్రికి తెలియవా?
 
ఇళ్లపట్టాలపేరుతో వైసీపీ ప్రభుత్వం పనికిరాని భూములను పేదలకు ఇచ్చి, కోట్లరూపాయలకుంభకోణం చేసింది. ఇళ్లపట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.4వేలకోట్ల వరకు దోపిడీ జరిగింది. మైనింగ్ లీజులు కూడా ఇష్టానుసారం నచ్చినవారికి కేటాయిస్తూ, దోపిడీ చేస్తున్నారు. వీటన్నింటిపై ప్రజలకు  సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై లేదా?  ఉత్తరాంధ్రలో మంత్రులను పక్కనపెట్టి, విజయసాయిరెడ్డే సర్వంతానై వ్యవహరిస్తున్నాడు.

విశాఖ మహానగరపాలక సంస్థను క్లుప్తంగా గతంలో ఉడాగా పిలిచేవారు. ఇప్పుడు దాని పేరుమార్చి వీఎమ్ఆర్ డీఏ (విశాఖ మెట్రపాలిటన్ రీజినల్ డెవలప్ మెంట్ అథారిటీ) గా పిలుస్తున్నారు. దాని పరిధిలో ఉన్నవారికి ఇళ్లపట్టాలుఇవ్వాలని 1400ఎకరాలు సేకరించారు. ఆ భూమి మొత్తం కొండలు, గుట్టలు, లోతట్టుప్రాంతాల్లోనే ఉంది.

సదరుభూమి చదునుకోసం రూ.23కోట్లను ప్రభుత్వం మంజూరుచేస్తే, ఆసొమ్ముతో చేసే పనులకు ఎటువంటి టెండర్లు పిలవకుండా, మంత్రులు బొత్స, అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డి తమవాళ్లకు పనులను కట్టబెట్టారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, రూ.23కోట్ల పనులను తమ అనుమాయులకు కట్టబెట్టేసి, ఏవిధమైన పనులు చేయకుండానే, ఆసొమ్మంతా కాజేశారు.

రూ.23కోట్లకు సంబంధించిన పనుల వ్యవహారంపై, నిధులు డ్రాచేయడంపై తక్షణమే ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఏ విచారణ జరిపిస్తారో జరిపించి నిజాలు బయటపెట్టాలి. 

మంత్రి జయరామ్ అవినీతిని తాను బయటపెట్టానని, ఆయన తనను ఇష్టానుసారం తిడుతున్నాడు తప్ప, తనకు భూములెలా వచ్చాయో, 203ఎకరాలు కొనడానికి అవసరమైన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో సమాధానం చెప్పడం లేదు. మంత్రిపై కర్ణాటక పోలీస్ స్టేషన్లో కంపెనీ వారు ఎందుకుఫిర్యాదు చేశారు?

కర్ణాటక కంపెనీకి చెందిన భూములను కాజేసిందికాక, మంత్రి, ఆయన కుటుంబసభ్యులు వాటిని బ్యాంకులో తనఖాపెట్టి ఎందుకు రుణాలు తీసుకోవాలని చూశారు. ఈ ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా ఊరికే నోరుంది కదా అని అయ్యన్నపాత్రుడిని తిడితేఎలా? మంత్రి ఇంతచేస్తుంటే, ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉంటేఎలా? 

విశాఖపట్నంలో ప్రేమసమాజం అనే స్వచ్ఛందసంస్థ ఉంది. కుష్టురోగులు, ఇతరేతరవ్యాధులబారిన పడేపేదవారికి సదరుసంస్థ సేవచేస్తూ ఉంటుంది. ఆ సంస్థపనితీరుని చూసినకొందరు కోట్లవిలువైన తమఆస్తులను సంస్థకు విరాళమిచ్చారు.

కొందరుదాతలు ఇప్పటికీ రుణసహాయం చేస్తుంటారు. అటువంటి సంస్థను, ప్రభుత్వం రాత్రికి రాత్రే ఎండోమెంట్ శాఖపరం చేసింది. సదరు ప్రేమసమాజం కింద ఉన్న కొన్ని విలువైనఆస్తులను, అతిముఖ్యమైన రిసార్టులను ఆక్రమించుకోవడానికే ఆపనిచేశారని తేలింది. సేవాసంస్థకుఇచ్చిన ఆస్తులను కూడా వదలకుండా దోచేస్తారా? 
 
ఇంతజరుగుతుంటే ముఖ్యమంత్రి తనకేమీ తెలియనట్లుగా మౌనంగా ఉంటే, దాని అర్థం ఏమిటి? మంత్రులు, ఎమ్మెల్యేలుచేస్తున్న అవినీతిలో ఆయనకు కూడా వాటా అందుతుందని ప్రజలు అనుకుంటున్నారు. తన మంత్రి మండలిలో సభ్యుడైన జయరామ్ పై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే, తాము కోర్టుకు వెళతాం. మంత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలు చేస్తాం. 

వ్యవసాయమంత్రి కన్నబాబుకి మాటలు ఎక్కువ-పని తక్కువ. గతంలో  రైతులనుంచి కొనుగోలుచేసిన తడిసిన ధాన్యం తాలూకా బకాయిలను ఇప్పటివరకు ఎందుకు చెల్లించలేదో మంత్రి చెప్పాలి. రూ.వందలకోట్ల బకాయిలను రైతు ప్రభుత్వం ఎందుకు ఆపేసింది. రైతులు కష్టాల్లో ఉంటే, ఇప్పుడుకూడా వారికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించరా?

చంద్రబాబు పాలనలో వారంలోనే కొనుగోలు సొమ్ముని చెల్లించేవాళ్లం. రైతులకు అందాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు.  ఎందుకు చేస్తున్నారు ఇటువంటి దిక్కుమాలిన పాలన? దోపిడీకోసం తప్ప, మరెందుకు పనికొస్తుంది ఈపాలన? 
 
సోషల్ మీడియాలో తమను, తమప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై రాత్రికిరాత్రే చర్యలు తీసుకొనే పోలీస్ శాఖ మంత్రి జయరామ్ అవినీతికి సంబంధించి వచ్చిన వార్తలపై సుమోటాగా  ఎందుకు కేసునమోదు చేయలేదు. సీఐడీ విభాగం ఈ వ్యవహారంపై ఎందుకు దృష్టిపెట్టలేదు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి మంత్రి జయరామ్ అవినీతిపై విచారణ జరిపించి, ఆయన్ని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నా.