మరింత వేగంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు... ఎలా?
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ నిర్మాణ పనులకు హడ్కో మరో రూ.11 వేల కోట్ల మేరకు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ నిధులను కూడా త్వరలోనే విడుదల చేయాలని భావించింది. ఈ విషయాన్ని ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి రూ.11 వేలు కోట్ల నిధులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి హడ్కో సానుకూలంగా స్పందించిందని చెప్పారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో గతంలోనే రూ.11 వేల కోట్లు కేటాయించింది. దీనిపై గతేడాది అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు. ఈ నేపథ్యంలో, తాజాగా ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించింది.