లిండ్‌బర్గ్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా తప్పించుకున్న తెలుగు విద్యార్థులు
అమెరికాలో జరిగిన ఓ భారీ అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. తెలుగు విద్యార్థులు నివాసముండే అపార్టుమెంటులో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం వార్త తెలిసిన వెంటనే వారంతా తమతమ గదులను ఖాళీ చేసి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం అమెరికాలోని జార్జియా రాష్ట్రం లిండ్‌బర్గ్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... లిండ్‌బర్గ్‌లోని ఓ బహుళ అంతస్తు భవనంలో రెండు రోజుల క్రితం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భవనంలోని ఓ ప్లాట్‌లో 28 మంది తెలుగు విద్యార్థులు అద్దెకు నివాసముంటున్నారు. వీరంతా జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తున్నారు.
వీరు నివసించే భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో వారంతా తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో 80 ప్లాట్లు కాలిపోయాయి. కానీ, విద్యార్థులకు చెందిన దుస్తులు, పుస్తకాలు, పాస్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ధ్రువపత్రాలతో సహా అన్ని వస్తువులు ప్రమాదంలో కాలిపోయాయి.
ఈ ఘటన గురించి తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థులను ఆదుకొనేందుకు చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో వెంటనే స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) సతీష్‌చంద్ర.. బాధిత విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని విదేశీ విద్య సమస్వయ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు.