యూఏఈకి చేరిన ఆష్రఫ్ ఘని - మానవతాదృక్పథంతోనే ఆశ్రయం కల్పించాం.
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రదాలు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని దేశం విడిచిపారిపోయాడు. ప్రస్తుతం ఆయన యూఏఈలో తలదాచుకుంటున్నారు. తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించగానే ఆయన దేశాన్ని విడిచిపోయారు.
ఘనీకి, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించడానికి అంగీకరించామని యూఏఈ బుధవారం తెలిపింది. అయితే, యూఏఈలో ఆయన ఎక్కడ ఉన్నదీ మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు, ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్ చేతుల్లోకి వెళ్లి సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కార్ల నిండా భారీ నగదుతో దేశం నుంచి పరారయ్యారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తొలిసారిగా దీనిపై వివరణ ఇచ్చారు.
తాను డబ్బుతో పరారైనట్టు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాలిబన్లు వస్తున్నారని, వెంటనే వెళ్లిపోవాలని తన భద్రతా విభాగం కోరిందని, కనీసం బూట్లను మార్చుకునే సమయం కూడా లేదన్నారు. మరోవైపు మాతృదేశాన్ని అమ్మేసి పారిపోయిన ఘనీని అరెస్ట్ చేయాలని ఆ దేశ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్ ఇంటర్‌పోల్‌ను కోరారు.