ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (22:37 IST)

తాలిబన్లతో కేంద్రం చర్చలు జరపాలి.. పోయేదేముంది..?: అసదుద్దీన్ ఒవైసీ

తాలిబన్లను భారత్ గుర్తించినా గుర్తించకపోయినా వారితో చర్చలు జరపాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాలిబన్లతో చర్చలు జరపాలని అంతర్జాతీయ భద్రతా నిపుణులంతా కూడా చెబుతున్నారని అన్నారు. వరుస ట్వీట్లలోనూ, ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు తాలిబన్లతో దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచాలని 2013లోనే తాను సలహా ఇచ్చానని, అయితే తన సలహాను ఖాతరు చేయలేదని, పైగా విమర్శించారని ఒవైసీ అన్నారు.
 
2019లో అప్ఘనిస్థాన్‌కు సంబంధించిన వాస్తవాలపై నా ఆందోళన తెలియజేశాను. పాకిస్తాన్, అమెరికా, తాలిబన్లు మాస్కోలో చర్చలు జరుపుతుంటే, ట్రంప్‌ను ఆయన ఎన్నిసార్లు హగ్ చేసుకున్నారో పీఎంఓ ఇండియా లెక్కలు వేస్తూ వచ్చింది. ప్రభుత్వ ఆప్ఘనిస్థాన్ విధానం ఏమిటో ఇప్పటికీ మనకు తెలియడం లేదు అని ఒవైసీ ట్వీట్ చేశారు. 
 
భారతదేశం 3 బిలియన్ డాలర్లు ఆప్ఘనిస్థాన్‌లో పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని ఓవైసీ ప్రశ్నించారు. షరామామూలుగానే మోదీ ప్రభుత్వం సంక్షోభం తలుపుతట్టినప్పుడు నాటకీయత మొదలుపెడుతుందని ఒవైసీ విమర్శించారు.