1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 ఆగస్టు 2021 (16:25 IST)

వన్ టైమ్ వాడి పడేసే ప్లాస్టిక్‌ బంద్.. 120 మైక్రాన్లు పెంపు

వన్ టైమ్ వాడి పడేసే ప్లాస్టిక్‌ను బంద్ చేసింది కేంద్రం. వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగం నిబంధనల్లో కేంద్రప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం దేశంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లపై నిషేధం ఉండగా దానిని 120 మైక్రాన్లకు పెంచింది. తాజా నిబంధనలు వచ్చే ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. 
 
ఈ మేరకు సవరించిన నిబంధనలు శుక్రవారం నోటిఫై చేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ(సవరణ) నిబంధనలు-2021 గెజిట్‌ను జారీచేసింది. దేశంలో ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టి పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా తాజా నిబంధనలను తీసుకువచ్చారు. ఈ నిబంధనలు అంచెలవారీగా అమలు అవుతాయి. ఈ సెప్టెంబర్‌ 30 నుంచి 75 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లనే వినియోగించాలి.
 
నిషేధం వేటిపైనంటే..?
ఇయర్‌ బడ్స్‌, బెలూన్లకు ఉండే ప్లాస్టిక్‌ స్టిక్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీ స్టిక్స్‌, ఐస్‌క్రీమ్‌ స్టిక్స్‌, డెకరేషన్‌ కోసం వాడే థర్మాకోల్‌, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్‌, ప్లాస్టిక్‌ కత్తులు, స్ట్రాలు, ట్రేతోపాటు స్వీట్‌ బాక్సులు, ఇన్విటేషన్‌ కార్డులు, సిగరెట్‌ ప్యాకెట్ల ప్యాకింగ్‌కు వాడే ఫిల్మ్స్‌, పీవీసీ బ్యానర్లు.