శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జులై 2020 (09:25 IST)

అమెరికాలో నైట్ క్లబ్‌లో గర్జించిన తుపాకీ.. ఇద్దరు మృతి

అమెరికాలో తుపాకీ కాల్పుల సంస్కృతి మళ్లీ చెలరేగింది. నైట్ క్లబ్‌లో జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. దక్షిణ కరోలినా, గ్రీన్‌విల్లేలోని నైట్‌క్లబ్‌లో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
క్లబ్‌లో ఏదో గందరగోళంగా ఉన్న విషయాన్ని గుర్తించిన గ్రీన్‌విల్లే కౌంటీ షరీఫ్ కార్యాలయ డిప్యూటీ వెంటనే ఎమర్జెన్సీకి సమాచారం అందించారు. ఆ సమయంలో ఆయన ల్యావిష్ లాంజ్ క్లబ్ పార్కింగ్ లాట్‌లో ఉన్నారు. దాదాపు 2 గంటల సమయంలో కాల్పులు వినిపించడంతో వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ సర్వీసుకు సమాచారం అందించినట్టు లెఫ్టినెంట్ జిమ్మీ బోల్ట్ తెలిపారు.
 
గ్రీన్‌విల్లే పోలీసులు, దక్షిణ కరోలినా హైవే పెట్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లబ్‌లో మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు వినిపించాయని, పోలీసులు మాత్రం ఎటువంటి కాల్పులు జరపలేదని బోల్ట్ తెలిపారు. 
 
కాల్పులు జరిగినప్పుడు క్లబ్ చాలా రద్దీగా ఉందని పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు అనుమానితులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని బోల్ట్ పేర్కొన్నారు