శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 జూన్ 2020 (18:02 IST)

ప్రపంచ అపరకుబేరులు జాబితాలో ముఖేశ్ అంబానీ స్థానమెంత?

ప్రపంచంలో అపర కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అవతరించారు. ఈ జాబితాలో ఆయన 11వ స్థానంలో నిలిచారు. దీనికి కారణం ముఖేష్ అంబానీ రియల్ టైమ్ నెట్ వర్త్ మొదటిసారి 60 బిలియన్ డాలర్లను దాటింది. ఫలితంగా ప్రపంచ అపరకుబేరుల జాబితాలో చేరారు. 
 
ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఓ జాబితాను తయారు చేసి వెల్లడించింది. ఈ ఇండెక్స్ మేరకు ముఖేష్ అంబానీ రియల్ టైమ్ నెట్ వర్త్ ఇప్పుడు 60.3 బిలియన్ డాలర్లు (రూ.4.58 లక్షల కోట్లు) వద్ద ఉంది. దీనికి కారణం ముఖేష్‌ అంబానీ సంపద ఒక రోజులో 1.16 బిలియన్ డాలర్లు పెరిగింది. 
 
ఆర్‌ఐఎల్ షేర్ ధర శుక్రవారం రికార్డు స్థాయిలో రూ.1737.95 ను తాకింది. ఇది అంతకుముందు రూ.1655 ముగింపు కంటే 5 శాతం ఎక్కువ. ముఖేష్ అంబానీ దాటికి స్పానిష్ ఫ్యాషన్ రిటైల్ చైన్‌ జారా వ్యవస్థాపకుడు అమానికో ఒర్టెగా వెనబడిపోయారు. ఒర్టెగా ప్రస్తుతం 59 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నాడు.
 
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రుణ విముక్తి కల్పిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చానని ముఖేష్ అంబానీ చెప్పారు. సంస్థ రుణ రహితంగా మారుస్తానని 2019 ఆగస్టు 12 న సంస్థ 42 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. 2021 మార్చి 31 గా నిర్ణయించిన గడువు కన్నా 9 నెలల ముందే హామీని నెరవేర్చారు. 9 నెలల ముందు కంపెనీ రుణ రహితంగా మారిందని కంపెనీ వాటాదారులకు తెలియజేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 
 
కాగా, 2020 మార్చి 30 నాటికి రిలయన్స్ కంపెనీకి రూ.1,61,035 కోట్ల రుణాలు ఉన్నాయి. గత 58 రోజుల్లో కంపెనీ గ్లోబల్ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ.1.15 లక్షల కోట్లు పెట్టుబడులను సాధించింది. ఇవేకాకుండా, రైట్స్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.53,124.20 కోట్లను సమీకరించింది. ఫలితంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరక ఆస్తి విలువ రూ.60.3 బిలియన్ డాలర్లుగా పెరిగిపోయింది.