మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 జూన్ 2020 (15:48 IST)

మా నాన్నే నా తొలి గురువు.. ఆయనే నా బలం : సీఎం వైఎస్ జగన్

ఫాదర్స్ డేను పురస్కరించుకుని వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ముఖ్యంగా, మా నాన్నే నా తొలి గురువు, ఆయనే తన బలం.. తనకు స్ఫూర్తి అంటూ పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, 'ప్రతి తండ్రి తన పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తారని, పిల్లలకు ప్రేమను, స్ఫూర్తిని పంచుతారని తెలిపారు. నాన్నే మనకు తొలి గురువు, స్నేహితుడు, హీరో అని వివరించారు. మన సంతోషాలన్నీ ఎక్కువగా నాన్నతోనే పంచుకుంటామని, ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు.
 
చిరుతతో చార్మింగ్‌ డ్యాడ్‌..
ఫాదర్సే డే సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు తమ తండ్రులతో దిగిన ఫోటోలను షోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్ మహేష్ బాబుతో పాటు... పలువురు హీరోలు, హీరోయిన్లు, నటీనటులు తమతమ ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశారు. అయితే, చిరంజీవి, మహేష్ బాబు చేసిన పోస్ట్ ఇపుడు ఆసక్తికరంగా మారింది. 'చిరుతతో చార్మింగ్‌ డ్యాడ్‌.. మా నాన్న నవ్వు ... నా బిడ్డ చిరునవ్వు... రెండూ నాకు చాలా ఇష్టం. హ్యపీఫాదర్స్ డే' అంటూ చిరంజీవి కామెంట్స్ చేశారు. 
 
'దృఢమైన, దయ, ప్రేమ, సున్నిత, చాలా శ్రద్ధ తీసుకునే తండ్రి.. నాకు, నా తండ్రి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పడానికి ఇవి కొన్ని పదాలు. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. ఆయన నాకు నేర్పిందే నేను నా పిల్లలకు నేర్పుతున్నాను. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్న' అని మహేశ్ బాబు పేర్కొన్నాడు. చిన్నప్పుడు తన తండ్రితో దిగిన ఫొటోలను ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.
 
అలాగే, ఒకనాటి హీరోయిన్, ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా కూడా తన తండ్రితో ఫొటోలతో రూపొందించిన వీడియోను పోస్ట్ చేసి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ప్రతి గొప్ప కూతురి వెనుక ఓ గొప్ప తండ్రి ఉంటారని పేర్కొన్నారు. తన తండ్రి ఎప్పటికీ తనతో ఉంటూ తనకు మార్గదర్శకాలు చేస్తుంటారని చెప్పారు.
 
మనల్ని ప్రేమిస్తున్నామని మన తండ్రి మనకు ఎన్నడూ చెప్పబోరని, తన ప్రేమను తన చేతల్లో చూపెడతారని ఆమె తెలిపారు. అమ్మాయి తొలి ప్రేమ నాన్నపైనేనని చెప్పారు. గొప్ప తండ్రిని ఇచ్చినందుకు మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫొటోలను కూడా రోజా పోస్ట్ చేశారు.