1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 మార్చి 2016 (09:06 IST)

పాకిస్థాన్‌లో నరమేథం.. పార్కులో మానవబాంబు దాడి.. 70 మృతి

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. లాహోర్‌లోని ఓ ప్రముఖపార్కులో ఆదివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 70 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. దాదాపు మరో 300 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
ఈస్టర్‌ సందర్భంగా పంజాబ్‌ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లోని గుల్షాన్‌-ఇ-ఇక్బాల్‌ పార్కులో క్రైస్తవులు సహా అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ సందర్భంగా ఆత్మాహుతి దాడి సభ్యుడు పార్కు ప్రధాన గేటు వద్ద సాయంత్రం 6.40 సమయంలో తనను తాను పేల్చసుకున్నట్లు లాహోర్‌ పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ హైదర్‌ అష్రాఫ్‌ వెల్లడించారు. 
 
ఆత్మాహతి దాడి కోసం 8-10 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను వినియోగించినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం క్రైస్తవులు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఆత్మాహుతికి పాల్పడ్డ వ్యక్తిదిగా భావిస్తున్న తలను ఘటనాస్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, తెగిపడిన అవయవాలు, రక్తంతో పేలుడు అనంతరం పార్కు ఆవరణ భీతావాహంగా మారింది. మరోవైపు, దాడికి పాల్పడింది తామేనని తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) చీలిక విభాగమైన జమాతుల్‌ అహ్రర్‌ ప్రకటించింది.