అయస్కాంతాన్ని మింగిన బాలుడు.. ఎందుకంటే?
లండన్‌లో టీచర్స్ చెప్పిన సైన్స్ పాఠం విని ఓ బాలుడు ప్రయోగం చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. అయస్కాంతాన్ని మింగి నానా తంటాలు పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రిలే మారిసస్ అనే పన్నెండేళ్ల బాలుడు... టీచర్ చెప్పిన అయస్కాంత గురుత్వాకర్షణ పాఠం విని.. ఆకర్షితుడయ్యాడు. అంతటితో ఆగకుండా సొంత ప్రయోగానికి సిద్ధమయ్యాడు.
శరీరంలో ఒక పెద్ద అయస్కాంతం ఉంటే ప్లేట్ల లాంటి వాటిని పట్టుకునే అవసరం ఉండదు కదా అనుకుని.. 54 మాగెటిక్ బాల్స్ కడుపులోకి మింగాడు. ఆ తర్వాత అవి ఎలా పనిచేస్తాయో చూద్దామనుకున్నాడు. కానీ, సీన్ రివర్స్ అయింది. కడుపులో గందరగోళం మొదలైంది. ఇక భరించలేని దశలో తన తల్లి వద్దకు వెళ్లి పొరపాటున అయస్కాంతాలను మింగానని చెప్పాడు.
కుమారుడి అవస్థ చూసి ఆందోళనకు గురైన ఆ తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. నిపుణులైన డాక్టర్ల బృదం ఆ బాలుడికి ఎమర్జెన్సీ శస్త్రచికిత్స నిర్వహించింది. కడుపులో మాగెటిక్ బాల్స్‌ని బయటకి తీశారు. అందుకు సుమారు 6 గంటల సమయం పట్టింది.
చికిత్స తర్వాత.. డాక్టర్లు బాలుడిని అన్ని మాగెటిక్ బాల్స్‌ని ఎందుకు మింగావని ప్రశ్నించగా, అయస్కాంతం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామనే అన్ని బాల్స్ మింగానని ఆ బాలుడు చెప్పడంతో.. వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. వాటిని బయటకు తీయడం ఏమాత్రం ఆలస్యమైనా బాలుడి విసర్జక వ్యవస్థ, ఇతర అవయవాలు దెబ్బతిని ప్రాణాలు పోయే ప్రమాదం ఉండేదన్నారు.