శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (14:05 IST)

తల్లిపై కన్నేశాడు... అడ్డుగా ఉన్నారనీ చిన్నారులను కిడ్నాప్ చేసి...

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఏకలవ్య నగర్‌లో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. చిన్నారుల తల్లిపై కన్నేసిన ఓ వ్యక్తి పక్కా ప్లాన్‌ ప్రకారం ఇద్దరు పిల్లలను కిడ్నాప్‌ చేశాడు. అందులో బాలికను బెంగళూరులో అమ్మేశాడు. బాలుడుని చంపి కేసీ కెనాల్‌లో పడేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘట వివరాల గురించి పోలీసులు వెల్లడించారు. నంద్యాల పట్టణం ములాన్‌పేటకు చెందిన ఇలియాస్‌, ఆయేషా దంపతులకు కుమారు పఠాన్‌ అఫ్జల్‌ ఖాన్‌(12), కూతురు (9) సంతానం. ఇలియాస్‌ మద్యానికి బానిస కావడంతో మూడేళ్ల క్రితం దంపతులు విడిపోయారు. 
 
ఆయేషా ఏకలవ్యనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తన ఇద్దరి పిల్లలతో ఉంటోంది. ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఆయేషాకు ఏకలవ్యనగర్‌కి చెందిన చాకలి నాగకృష్ణ అలియాస్‌ కిట్టుతో పరిచయం ఉంది. చిన్నారులను బాగా చూసుకుంటానని కుటుంబానికి చేరువయ్యాడు.
 
తన ఇద్దరు పిల్లలు కనపడకపోవడంతో జనవరి 25వ తేదీ రాత్రి 11.30 గంటలకు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయేషా ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, రేవనూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేసీ కెనాల్‌లో గుర్తు తెలియని మృతదేహం సోమవారం లభ్యమైంది. 
 
దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మృతదేహం అది నంద్యాలలో మిస్సింగ్‌ కేసు నమోదైన అఫ్జల్‌ఖాన్‌‌గా గుర్తించారు. ఈ కేసులో నాగకృష్ణను అనుమానించిన పోలీసులు, అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో బనగానపల్లె మండలం కొత్తపేట గ్రామానికి చెందిన తన మిత్రుడు ఎరుకల ధనుంజయుడు సాయంతో చిన్నారులను కిడ్నాప్‌ చేసినట్లు ఒప్పుకున్నాడు. 
 
వారిని బెంగళూరుకు తీసుకువెళ్లామని, బాలికను బెంగళూరులో పిల్లలు లేనివారికి రూ.28 వేలకు అమ్మేశామని అంగీకరించాడు. పఠాన్‌ అఫ్జల్‌ ఖాన్‌ను తిరిగి నంద్యాలకు తెచ్చామని, తన చెల్లెలిని అమ్మిన విషయం తల్లికి చెబుతాడేమోనన్న అనుమానంతో మద్యం మత్తులో గొంతునులిమి చంపేశామని చెప్పారు. 
 
బాలుడి మృతదేహాన్ని చాబోలు వద్ద కేసీ కెనాల్‌లో పడేశామని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. బెంగళూరులో ఉన్న బాలికను నంద్యాల త్రీటౌన్‌ పోలీసులు తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.