గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (18:55 IST)

శ్రీకాకుళం: అనాధ వృద్ధుడి శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై

పోలీసులు అనగానే వారి హృదయం చాలా కరకుగా వుంటుదని చాలామంది అనుకుంటారు. కానీ వృత్తిరీత్యా నేరస్తుల విషయంలో అలా వుండక తప్పదు. ఐతే వారి హృదయాలు దయార్ద్రమైనవని ఎన్నో ఉదంతాలు చూపాయి. తాజాగా ఇలాంటి ఘటనే శ్రీకాకుళంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే... కాసిబుగ్గు-పలాసా ప్రాంతంలోని సంపంగిపురంలోని అడవికొట్టూరులోని వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడని పోలీసులకు సోమవారం ఉదయం సమాచారం అందింది. దీనితో కానిస్టేబుళ్లతో పాటు మహిళా ఎస్సై శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృద్ధుడి మృతదేహాన్ని తరలించేందుకు ఎస్సై శిరీష స్థానిక గ్రామస్తుల సాయం కోరారు. ఐతే వారు ఆ వృద్ధుడి మృతదేహాన్ని తాకడానికి కానీ కనీసం సహాయం చేయడానికి కానీ ముందుకు రాలేదు.
 
వాహనంలో తరలించేందుకు అనువుగాలేని పొలాల్లో సాయం చేయాలని అడిగినా ఎవరూ స్పందించలేదు. దీనితో ఎస్సై శిరీష ముందుకు కదిలారు. లలిత ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యుడి సహాయంతో ఆ వృద్ధుడి మృతదేహాన్ని తాత్కాలిక స్ట్రెచర్‌లో తన భుజాలపై మోసుకుంటూ అర్థగంట పాటు ఒక కిలోమీటరు దూరంలో ఆపి ఉంచిన తన వాహనం దగ్గరు తీసుకెళ్లారు. 
 
ఆమె వృద్ధుడి మృతదేహాన్ని మోసుకెళ్ళడం చూసిన తరువాత, కొంతమంది గ్రామస్తులు ముందుకు వచ్చి సహాయం అందించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అనాధలా మృతి చెందిన ఓ వ్యక్తికి గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు చేసే దిశగా ఒక మహిళా పోలీసు అధికారి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.