శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 14 జూన్ 2017 (07:16 IST)

తిరుగుబాటుకు చెరగని సంకేతం.. పరిపూర్ణ మానవుడు.. చేగువేరా

పోరాటంలో నేలకొరిగిన చే మరణ వార్త వినగానే మన కాలపు పరిపూర్ణ మానవుడు చే (Che... the most complete human being of our age) అంటూ ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ తత్వవేత్త జీన్ పాల్ సార్త్ తనకు నివాళి పలికారంటే చ

20వ శతాబ్దపు 100మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో చేగువేరా ఒకరు. చేగువేరా ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతికుడు, క్యూబన్ విప్లవంలో ప్రముఖవ్యక్తి. బొలీవియాలో ప్రజా విప్లవానికి శ్రీకారం చుడుతూ.. ఆ దేశ నియంత సైనికుల చేతిలో మరణించినప్పటినుండి, ప్రపంచ వ్యాప్తంగా తిరుగుబాటుకు చెరగని సంకేతంగా మారాడు చే. దోపిడి, తిరుగుబాటు, పోరాటం, విప్లవం, సమానత్వం, కమ్యూనిజం, సోషలిజం.. ఒక్కటేమిటీ అన్ని అంశాలను పామరుడికి సైతం అర్థమయ్యేలా వివరించడం, యుద్ధక్షేత్రంలో ఏమాత్రం బెరుకులేకుండా దూసుకెళ్లడం చేగువేరా సహజనైజం. 
 
పోరాటంలో నేలకొరిగిన చే మరణ వార్త వినగానే మన కాలపు పరిపూర్ణ మానవుడు చే (Che... the most complete human being of our age) అంటూ ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ తత్వవేత్త జీన్ పాల్ సార్త్ తనకు నివాళి పలికారంటే  చేగువేరా అనే నవ యువకుడు ప్రపంచ మేధావులపై వేసిన మహత్తర ప్రభావం అర్థమవుతుంది. చే పోరాటంలో నేల కూలిన నాటికి తన వయస్సు 39 సంవత్సరాలు మాత్రమే.
 
సరైన ఆలోచన ఎంత ముఖ్యమో దానిని పక్కాగా అమలుచేయడమూ అంతే ప్రధానం. ఇక సాయుధపోరాటంలో ఎత్తుగడలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. క్యూబా విప్లవ పోరాటంలో ఫెడల్‌ క్యాస్ట్రో ఆలోచన అయితే అతని అమ్ములపొదిలోని ప్రధాన ఆయుధం చేగువేరా. ఎక్కడో పుట్టి, పరాయి దేశంలో సమసమాజ స్థాపన కోసం తుపాకి పట్టిన చేగువేరాకు, అతని పరాక్రమానికి ఎల్లవేళలా ప్రోత్సాహం ఇస్తూ విప్లవాన్ని విజయవంతం చేయడంలో ఫెడెల్‌ క్యాస్ట్రో అనుసరించిన తీరు చరిత్రలో అరుదైన ఘట్టం.
 
చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. రచయితగా, గెరిల్లా యుద్ధ వీరుడిగా ప్రసిద్ధిపొందిన చేగువేరా మోటర్‌ బైక్‌పై వివిధ దేశాలు తిరుగుతూ ప్రజల అవస్థలు చూసి తల్లడిల్లిపోయాడు. మెక్సికోలో రావుల్ క్యాస్ట్రో, ఫెడైల్ క్యాస్ట్రోలను కలుసుకున్నాడు. ప్రసిద్ధ ‘జూలై 26 విప్లవం’లో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్యూబా చేరుకున్నాడు. 
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. విప్లవం విజయవంతం అయిన తర్వాత ప్రధాని హోదాలో ఫెడల్ క్యాస్ట్రో.. క్యూబాకు ఆయువుపట్టైన చక్కెర, పరిశ్రమల శాఖకు చేగువేరాను మంత్రిగా నియమించాడు. ప్రస్తుతం క్యూబా ప్రపంచ చెక్కెర గిన్నె(సుగర్‌ బౌల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌)గా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.
 
విప్లవం అనంతరం ఒక దేశంగా క్యూబా మనుగడ సాధించాలంటే ప్రపంచంలోని మిగతా దేశాలతో(ఒక్క అమెరికాతో తప్ప) సఖ్యత అత్యవసరమైంది. ఆ బాధ్యతను కూడా ఫెడల్‌ క్యాస్ట్రో.. చేగువేరాకే అప్పగించాడు. క్యూబా విదేశాంగ మంత్రి హోదాలో చే.. భారత్‌ సహా రష్యా, శ్రీలంక, జపాన్‌, చైనా తదితర దేశాల్లో పర్యటించి, కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుని క్యాస్ట్రో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 
 
అయితే అధికార నిర్వహణ కంటే విప్లవం పురుడుపోసుకుంటున్న మిగత లాటిన్ అమెరికా, ఆఫ్రికన్‌ దేశాలకు తన సేవలు అవసరమని భావించిన చేగువేరా క్యూబా విడిచి బొలీవియా వెళ్లాలనుకున్నాడు. నిజానికి చేగువేరా లాంటి తురుపుముక్కను వదులుకోవడానికి ఏ రాజనీతిజ్ఞుడూ సిద్దపడడు.

కానీ అది విప్లవ పోరాటం. అక్కడ వ్యక్తిగత స్నేహాలకు తావులేదు. అందుకే దేశాధినేతగా కాకుండా ప్రియమైన స్నేహితుణ్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ఫెడల్‌ క్యాస్ట్రో.. చేగువేరాకు వీడ్కోలు పలికాడు. బొలీవియాలో ప్రభుత్వ సేనలతో పోరాడుతూ 1967 అక్టోబర్ 9న చే మరణించాడు.
 
(నేడు చేగువేరా జయంతి)