గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (11:37 IST)

'కరోనా' గురించి తొలిసారి హెచ్చరించిన వైద్యుడు ఆ వైరస్‌కే మృతి

Li Wenliang
చైనాలో పరిస్థితి అత్యంత దయనీంగా ఉంది. కరోనా వైరస్ ధాటికి అనేకమంది మృత్యువాతపడుతున్నారు. ప్రతిరోజూ అనేక వందల మందికి ఈ వైరస్ సోకుతోంది. దీంతో పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరోవైపు, కరోనా వైరస్ గురించి ఈ ప్రపంచానికి ముందే హెచ్చరించిన వైద్యుడు కూడా చివరకు ఆ వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. ఈ వార్త విన్న అనేక మంది తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆ వైద్యుడు పేరు లీ వెన్‌లియాంగ్. వయసు 34 యేళ్లు. ఈయన కరోనా వైరస్ బారినపడి శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని ఆయన పనిచేసిన వుహాన్ సెంట్రల్ ఆసుపత్రి అధికారింగా వెల్లడించింది. 
 
సీఫుడ్ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు ఆమధ్య అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వారిని పరీక్షించిన డాక్టర్ లీ వారిలో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఈ వైరస్ తీవ్ర ప్రమాదకరమని గుర్తించిన లీ.. ఇది మరింత విస్తరించి ప్రాణాలు బలిగొనే అవకాశం ఉందని ప్రపంచాన్ని హెచ్చరిస్తూ గతేడాది డిసెంబరు 30న సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ముఖ్యంగా, 'సార్స్' వంటి ప్రమాదకర వైరస్ వుహాన్‌ నగరంలో విస్తరిస్తోందని హెచ్చరించారు. 
 
ఈ పోస్టును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అతడిని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసింది. వైరస్ గురించి అపోహలు ప్రచారం చేస్తున్నందుకు పోలీసులు అతడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కానీ, ప్రస్తుతంలో దేశంలో నెలకొన్న పరిస్థితిని చూసి చైనా పాలకులు తాము చేసిన తప్పును తెలుసుకున్నారు. 
 
ఇంతలోనే ఆ వైద్యుడు కరోనా వైరస్ బారినపడ్డారు. గత నెల 12వ తేదీ నుంచి చికిత్స పొందుతూ వచ్చిన లీ గురువారం అర్థరాత్రి దాటాక 2:58 గంటలకు కన్నుమూశసినట్టు వైద్యులు తెలిపారు. ఆయనను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు.