శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 6 ఫిబ్రవరి 2020 (18:48 IST)

కరోనా వైరస్: వామ్మో చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ వ్యాపిస్తుందా?

కరోనా వైరెస్
చైనా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనావైరస్ వ్యాపించింది. ఈ వైరస్ ఇన్పెక్షన్‌తో మరణించిన వారి సంఖ్య 490 దాటింది. ఇప్పటివరకూ ఈ వైరస్‌కు గురైన వారి వారి సంఖ్య 17 వేలకు పైనే ఉంది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 'ప్రపంచ సంక్షోభం'గా ప్రకటించింది.

 
మొదట్లో ఈ వైరస్‌కు గురైనవారు ఎక్కువగా చైనాలో మరణించారు. తర్వాత గత ఆదివారం ఫిలిప్పీన్స్‌లో ఒక వ్యక్తి ఈ వైరస్‌తోనే చనిపోయాడని ధ్రువీకరించారు. దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనసులో ఈ వైరస్‌కు సంబంధించి ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఆ ప్రశ్నల్లో ఎక్కువగా అడుగుతున్న ఐదింటికి బీబీసీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది.

 
1.చైనా వస్తువులు తాకితే కరోనా వైరస్ వ్యాపిస్తుందా?
 
సమాధానం: చైనాలో వుహాన్ లేదా ఈ వైరస్ ఉన్న వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను తాకితే వైరస్ వ్యాపిస్తుందా అనే ప్రశ్నను ఇంటర్నెట్‌లో చాలామంది అడుగుతున్నారు. 
సమాధానం- వుహాన్ లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వస్తువులను ముట్టుకోవడం వల్ల వైరస్ వ్యాపించినట్టు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ వెలుగుచూడలేదు. కానీ, 2003లో చైనా.. ‘సార్స్’ అనే పేరుతో వచ్చిన కరోనా వైరస్‌ను ఎదుర్కొంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా 700 మందికి పైగా మృతిచెందారు.

 
ఆ వైరస్ ఉన్న వ్యక్తి తుమ్మడం, దగ్గడం వల్ల ఆ క్రిములు పడిన ఏదైనా వస్తువు లేదా ప్రాంతాన్ని తాకినపుడు ఆ వైరస్ వ్యాపించవచ్చని సార్స్ కేసుల్లో తేలింది. కానీ, కరోనావైరస్ కేసుల్లో ఇలా జరిగినట్లు ఇప్పటివరకూ చెప్పలేదు. ఒకవేళ ఈ వైరస్‌కు అంత సామర్థ్యం ఉంటే, అప్పుడు అంతర్జాతీయ ఎగుమతులు కూడా ఒక పెద్ద సమస్య కాబోతున్నాయా, అనే ప్రశ్న కూడా వస్తుంది.

 
సాధారణ జలుబుకు సంబంధించిన వైరస్ మనిషి శరీరం నుంచి బయటపడ్డాక 24 గంటలపాటు సజీవంగా ఉంటుంది. అయితే కరోనా వైరస్ కొన్ని నెలల వరకూ మనిషి శరీరం బయట సజీవంగా ఉండగలదు.

 
2. చైనాలో ఇన్ని వైరస్‌లు ఎందుకు పుట్టుకొస్తున్నాయి?
సమాధానం: చైనా జనాభాలో ఎక్కువ శాతం మంది జంతువులకు దగ్గరగా నివసిస్తుంటారు.
ఈ కరోనా వైరస్ కూడా వేరే ఒక జంతువు నుంచే మనిషికి వ్యాపించింది. పాముల నుంచే ఈ వైరస్ మనిషికి వచ్చిందని కూడా చెబుతున్నారు. ఇలాంటిదే అయిన సార్స్ వైరస్ గబ్బిలాలు, పునుగు పిల్లుల నుంచి మనుషులకు చేరింది. ఈ వైరస్ మొదటి కేసుల తీగ దక్షిణ చైనా సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్ వరకూ ఉంది. ఆ మార్కెట్లలో కోళ్లు, గబ్బిలాలతోపాటు పాములు కూడా అమ్ముతారు.

 
3.కరోనావైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆరోగ్యం మళ్లీ మామూలుగా అవుతుందా?

 
అది సాధ్యమే. ఈ వైరస్ వ్యాపించిన చాలా మందికి తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువమంది ఈ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడిన తర్వాత పూర్తిగా మామూలుగా అవుతారు. కానీ వృద్ధులు, మొదటి నుంచీ మధుమేహం, క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్నవారికి ఈ వైరస్ చాలా ప్రమాదకరం. దానితోపాటు రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి కూడా ఇది చాలా హానికరం అని చెబుతున్నారు.

 
4. వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటి, కరోనావైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత?
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి వైరస్‌కు గురైన తర్వాత నుంచి అతడిలో మొదటి లక్షణాలు బయటపడే వరకూ మధ్య సమయాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. కానీ, ఆ లోపు అతడి ఆరోగ్యంపై ఆ వైరస్ ప్రభావం కనిపించదు.

 
ప్రస్తుతం, కరోనావైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 2 నుంచి పది రోజుల మధ్య ఉంటుందని చెబుతున్నారు. కానీ దీనిని కచ్చితంగా అంచనా వేయడానికి తగిన సమాచారం అవసరం. ప్రతి వైరస్‌కూ, దాని ఇంక్యుబేషన్ పీరియడ్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని సాయంతో డాక్టర్లు, ప్రభుత్వాలు ఆ వైరస్ వ్యాపించకుండా అడ్డుకోగలుగుతాయి.
 
అంటే వారికి వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ గురించి తెలిస్తే, వైరస్ సోకిందని భావిస్తున్నవారిని గుర్తించి, మిగతా వారికి దూరంగా, విడిగా ఉంచవచ్చు.

 
5. కరోనావైరస్‌కు ఏదైనా వ్యాక్సిన్ ఉందా?
ప్రస్తుతానికి కరోనావైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. కానీ పరిశోధకులు ఈ వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలాంటి వైరస్‌ను ఇంతకు ముందు ఎప్పుడూ మనుషుల్లో గుర్తించలేదు కాబట్టి వ్యాక్సిన్ తయారీ ఆలస్యం అవుతున్నట్లు చెబుతున్నారు.