శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (14:49 IST)

వ్యవహారశైలిలోనూ సరికొత్త రికార్డు నెలకొల్పనున్న డోనాల్డ్ ట్రంప్

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఈయన తన వ్యవహారశైలిలోనూ సరికొత్త రికార్డు నెలకొల్పేలా ఉన్నరు. నిబంధనల ప్రకారం అధ్యక్షుడి దస్త్రాలను జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంది. దానికి విరుద్ధంగా ఆయనే వాటిని చెల్లాచెదురుగా విసిరి పారేస్తూ రావడంతో ఇప్పుడు వాటన్నింటినీ వెతికిపట్టుకుని ఒక్క చోటకు చేర్చడం శ్వేతసౌధం సిబ్బందికి తలనొప్పిగా మారింది. 
 
ఫైళ్లను ఇష్టానుసారంగా పడేసే అలవాటును మార్చూకోవాల్సిందిగా సిబ్బంది పలుమార్లు చెప్పినా ఆయన వినేవారు కాదని శ్వేతసౌధ రికార్డుల మాజీ విశ్లేషకుడు సాల్మన్ లార్టే చెప్పారు. 2018 నుంచి కనిపించకుండా పోయిన పత్రాలను వెతికిపట్టుకునేందుకు ఆయన అనేక గంటల సమయం వెచ్చించినట్టు చెప్పారు. 
 
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చేసిన సంభాషణపై దుబాసీ రాసిన నోట్సును ట్రంప్ తన అధీనంలో పెట్టుకున్నారు. రికార్డుల బదలాయింపులో చోటు చేసుకుంటున్న జాప్యం కారణంగా అవి ఎంతవరకు నిష్పాక్షికంగా ఉన్నాయనే ఆందోళన మరింత పెరుగుతోంది. 
 
అధ్యక్ష భవనంలో రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం ఒక ఎత్తయితే.. కొన్నింటిని దాచిపెట్టమని చెప్పడం, మరికొన్నింటిని నాశనం చేయాలని చెప్పడం వల్ల ఈ పరిస్థితి తప్పదని అంచనా వేస్తున్నారు.