బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2020 (12:10 IST)

వణికిపోతున్న దక్షిణి కొరియా.. ఒక్క రోజులోనే 300కి పెరిగిన కేసులు

చైనా వెలుపల అత్యధిక స్థాయిలో కరోనా కేసులు దక్షిణ కొరియాలోనే నమోదైనాయి. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 1,261 కరోనా కేసులు నమోదైనాయి. అలాగే దక్షిణకొరియాలో ఉన్న ఒక అమెరికన్ సైనికుడు కూడా వైరస్ బారిన పడ్డాడు.
 
18 మంది కొరియా సైనికులకు కూడా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో దక్షిణకొరియా కరోనా వైరస్ కారణంగా వణికిపోతోంది. మరోవైపు, అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఇరాన్, ఇటలీ, దక్షిణకొరియాకు వెళ్లొద్దని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 
 
ఇకపోతే.. కరోనా ప్రభావంతో దక్షిణ కొరియాలోని పలు అగ్రశ్రేణి సంస్థలు మూతపడనున్నాయి. ఒక ఉద్యోగికి వైరస్ సోకడంతో శాంసంగ్ కంపెనీ యూనిట్‌ను మూసేసింది. తాజాగా ఒక్క రోజులోనే దక్షిణ కొరియాలో కరోనా కేసులు ఏకంగా 300 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 
 
అంతేగాకుండా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న డ్యూగూ నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున మందులు, రక్షణ పరికరాలను సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణకొరియా ప్రధాని చుంగ్ సె క్యున్ మాట్లాడుతూ, కరోనా వైరస్‌పై పోరాటంలో ఈ వారం అత్యంత కీలకమైనదని చెప్పారు. 
 
ఇకపోతే.. కరోనా ప్రభావంతో దక్షిణ కొరియాకు చెందిన ఎస్కే హైనిక్స్ 800 మందిని ఐసొలేషన్‌లో ఉంచింది. పొహాంగ్‌లో ఉన్న ప్లాంట్‌ను హ్యుందాయ్, ఇంచియోన్‌లో ఉన్న ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఎల్జీ సంస్థలు తాత్కాలికంగా మూసేశాయి.