బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (06:05 IST)

కొవిడ్ ఎఫెక్ట్... ముద్దంటేనే ఫ్రాన్స్ బెంబేలు

ము..ము..ముమ్ముద్దంటే చేదా అంటూ పాట పాడుకునే వారు ఫ్రాన్స్ లో అధికమే. అయితే కొవిడ్ పుణ్యమాని ముద్దంటేనే బెంబేలెత్తిపోతోంది అక్కడి యువత. చైనాతో పాటు దాదాపు 60 దేశాలకు కొవిడ్-19 సోకిన విషయం తెలిసిందే.

ఆయా దేశాల్లోనూ రోజురోజుకూ వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో అక్కడి ప్రభుత్వాలు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

ఫ్రాన్స్, ఇటలీలలో వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో.. ఎక్కువ మంది ఒకేచోట సమావేశం కావడాన్ని ప్రభుత్వం నిషేధించింది. వైరస్ వ్యాప్తి కారణంగా.. ఇటలీలో ఐదు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.

ఇటలీలో ఇప్పటివరకు 900 మందికి వైరస్ సోకింది. వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటికే వారం రోజుల పాటు సెలవులను ప్రకటించింది.

అయితే తాజాగా వైరస్ కేసులు నమోదు కావడంతో.. మరో వారంరోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. ఆదివారం పారిస్‌లో జరగాల్సిన హాఫ్-మారథాన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.

కాన్స్‌లో నాలుగు రోజుల పాటు జరగాల్సిన ట్రేడ్ షోను కూడా పోస్ట్‌పోన్ చేసింది. ఫ్రాన్స్‌లో ఒక్క ఆదివారమే 19 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఐదు వేల మంది కంటే ఎక్కువగా హాజరయ్యే ఫంక్షన్ హాళ్లను తాత్కాలికంగా మూసివేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఆలివియర్ వేరాన్ ప్రకటించారు.

అదే విధంగా స్నేహితులను, బంధువులను పలకరించే సమయంలో వారికి ముద్దులు పెట్టకుండా ఉంటే మంచిదని ఆయన సలహా ఇచ్చారు.

ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 73 వైరస్ కేసులు నమోదవ్వగా.. 59 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 12 మంది మామూలు స్థితికి చేరుకోగా.. ఇద్దరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా 85 వేల కేసులు నమోదైనట్టు, వీరిలో 2900 మంది చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 58 దేశాల్లో కొవిడ్-19 కేసులను నమోదు చేసినట్టు తెలుస్తోంది.