మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (11:44 IST)

చైనాకు షాకిచ్చిన అమెరికా.. దలైలామా వారసుడిని..?

చైనాకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎంచుకునే హక్కు... టిబెటన్లకు కల్పిస్తూ ఉన్న బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది.

ద టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ ఆఫ్ 2020 ప్రకారం... టిబెట్ ప్రధాన నగరమైన లాసాలో యుఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేయనుంది. అలాగే దలైలామాకు వారసుడిని ఎన్నుకునే సంపూర్ణ హక్కు టిబెటన్లకు దక్కనుంది. 
 
ఇప్పటికే ఈ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. అంతేగాకుండా, ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుంటే, తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అమెరికా హెచ్చరించింది. 
 
కాగా.. ఇప్పటికే తన వారసుడి ఎంపిక విషయంలో దలైలామా చైనాకు షాకిచ్చారు. తదుపరి దలైలామా ఎంపిక నిర్ణయం తనదేనని చెప్పారు. తదుపరి దలైలామాగా ఎవరు ఉండాలో నిర్ణయించే హక్కు ఇతరులకు లేదన్నారు. చైనా ఎంపికచేసే వారసుడికి గౌరవం దక్కదని ఆయన స్పష్టం చేశారు. తన వారసుడు భారత్‌లోని తన అనుచురల్లో ఒకరు కావచ్చని కూడా ఆయన తెలిపారు. తన వారసుడిని ఎంపిక చేసేది లేనిదీ తనకు 90 ఏళ్ల వయసు వచ్చాక నిర్ణయిస్తానని దలైలామా 2011లోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 84 ఏళ్లు.
 
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 1959లో భారత్‌కు వలస వచ్చారు. ఆయనతోపాటు కొందరు స్థానికులు కూడా భారత్‌కు వచ్చేశారు. ధర్మశాలలో భారత్‌ వారికి ఆశ్రయం కల్పించింది. ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన వారసుడి ఎంపికపై చైనా ఆత్రంగా ఎదురు చూస్తోంది.