నిర్మాణ సంస్థ : నట్టి ఎంటర్‌టైన్‌మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు : శ్రీకాంత్ అయ్యంగార్, సాహితీ, గిరిధర్, గాయత్రి భార్గవి తదితరులు
సంగీతం : డి.ఎస్.ఆర్
నిర్మాతలు : నట్టి కరుణ, నట్టి క్రాంతి
దర్శకత్వం : ఆనంద్ చంద్ర
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేయగా, ప్రతి ఒక్క వ్యవస్థా స్తంభించిపోయింది. ఇందులో సినీ ఇండస్ట్రీ కూడా ఉంది. కానీ, టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం తనపనిని మాత్రం ఆపలేదు. కరోనా లాక్డౌన్ సమయంలోనే సినిమాలు తీసి ఓటీటీలో విడుదల చేసిన దర్శకనిర్మాత. పైగా, కరోనా టైమ్‌లోనూ ప్రేక్షకుడి నుండి క్యాష్ వసూలు చేసుకున్న దర్శకుడీయనే అనడంలో సందేహం లేదు. లాక్డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయితే తొలి సినిమాను కూడా థియేటర్స్‌లో విడుదల చేస్తుంది కూడా ఈ వివాదాస్పద దర్శకుడే.
ఆర్జీవీ ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు తెలుస్తుంటుంది. మీరు ఇదే కదా చెప్పాలనుకుంటున్నారు... కారణమేంటని అడిగితే మాత్రం.. నేను అందరూ అనుకుంటున్నది చెప్పడం లేదు. అలా అనుకుంటే నా తప్పు ఏం లేదు అని సింపుల్‌గా చెప్పేసి తప్పించుకుంటాడు. ఇది చాలా సందర్భాల్లో రుజువైన విషయమే.
ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ఓ దళిత యువకుడు ప్రణయ్ పరువు హత్యను ఆధారంగా చేసుకుని ఆర్జీవీ తెరకెక్కించిన చిత్రం "మర్డర్". ఈ సినిమాతో ఆర్జీవీ ఏం చెప్పాలనుకున్నాడు? అనే విషయం తెలియాలంటే ముందు కథేంటో చూద్దాం...
కథ:
మాధవరావు (శ్రీకాంత్ అయ్యంగార్) సమాజంలో పేరుతో పాటు.. ధనవంతుడు. ఈయనకు ఒకే ఒక కుమార్తె. అతని పంచ ప్రాణాలు ఆమెనే. పేరు నమ్రత (సాహితి). కూతురిని ప్రాణం కంటే ఎక్కువగా పెంచాడు. ఈ క్రమంలో నమ్రత తన కాలేజ్ మేట్ ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. ఈ విషయం తన తండ్రికి నమ్రత చెబుతుంది. ప్రవీణ్ గురించి మాధవరావు వాకబు చేయిస్తాడు. ప్రవీణ్, తన కుటుంబం డబ్బు కోసమే తన కూతురిని ట్రాప్ చేశారని తెలుస్తుంది. పైగా, తన కులంకాదని తెలుసుకుంటాడు. ఈ విషయం అమృతకి చెప్పినా వినిపించుకోదు.
ప్రవీణ్‌నే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టుపడుతుంది. దాంతో ఆమెను మాధవరావు హౌస్ అరెస్ట్ చేస్తాడు. ఓరోజు ఇంటి నుండి తప్పించుకుని పోయి ప్రవీణ్‌ని పెళ్లి చేసుకుని ఇంటికొస్తుంది. మాధవరావు ఇంట్లో గొడవలు అవుతాయి. నమత్ర, ప్రవీణ్‌తో వెళ్లిపోతుంది. అప్పటి నుండి కూతురి జ్ఞాపకాల్లో మాధవరావుకి పిచ్చెక్కుతుంది. అప్పుడు మాధవరావు ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయమేంటి? దాని వల్ల మాధవరావు గెలిచాడా? ఓడాడా? చివరికి మాధవరావు కుటుంబం ఏమవుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో 'మర్డర్' సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు ఆర్జీవీ. పబ్లిసిటీ కూడా అదే స్టైల్లో ప్రారంభించాడు. అయితే ఇటు అమృత, అటు ప్రణయ్ కుటుంబ సభ్యులు కోర్టుకెళ్లడంతో.. తనదైన స్టైల్లో నేను ప్రణయ్ హత్య ఆధారంగా సినిమా చేయలేదని, కూతురిని అమితంగా ప్రేమించిన తండ్రి కథను చేశానని తనదైన స్టైల్లో ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. కోర్టు కూడా స్క్రిప్ట్ పరిశీలించింది. రీవైజింగ్ కమిటీ సినిమా చూసింది. సినిమాలో ఇబ్బంది పడేవిధంగా ఏమీ లేదని అనుకున్న తర్వాత సినిమా విడుదలకు ఓకే చెప్పింది.
ఇకపోతే, కథ విషయానికి వస్తే కూతురుని ఎంతో అపూరంగా, ప్రేమగా పెంచుకున్న తండ్రి కథే మర్డర్. తన కూతురు సుఖంగా ఉందో లేదో అని భావించి, తను కట్టుకున్న వాడు మంచివాడు కాదని, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాడని తెలిసి భయపడి, ఏం చేయాలో తెలియని, కూతురుకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియని ఓ తండ్రి కథ. సినిమాలో ఎమోషన్సే ప్రధానంగా ఉంటాయి.
కూతురు తమను కాదని వెళ్లిపోతే తల్లిదండ్రులు పడే వేదన ఎలా ఉంటుందనే విషయాన్ని శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రి భార్గవి తమ నటనతో చక్కగా చూపించారు. ఇక మొండి పట్టుదల ఉన్న కూతురు నమ్రతగా సాహితి నటించింది. ఇక శ్రీకాంత్ అయ్యర్ తమ్ముడు పాత్రలో గిరిధర్ నటించాడు. దర్శకుడు ఆనంద్ చంద్ర సినిమాను తెరకెక్కించిన తీరు బాగానే ఉన్నా.. చాలా చోట్ల సన్నివేశాలు నెమ్మదిగా బుల్లితెరపై వచ్చే సీరియల్స్‌ను తలపిస్తాయి. డి.ఎస్.ఆర్ సంగీతం ఫర్లేదు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ.. వర్మ సినిమాల స్టైల్లోనే ఉన్నాయి.
సినిమా మొత్తంగా వర్మ ఓ తండ్రి ప్రేమ, ఆవేదనను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అలాగే ఓ తొందరపాటు నిర్ణయం కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందనే విషయాన్ని కూడా చూపించాడు. చివరకు నమత్ర తల్లి వద్దకు అత్త, మామల నిజ స్వరూపాన్ని తెలుసుకుని వచ్చేస్తుంది అంటూ తనేం చెప్పాలనుకున్నాడనే విషయాన్ని సినిమాగా చూపించేశాడు.