శనివారం, 19 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 ఏప్రియల్ 2025 (10:36 IST)

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్!!

Donald Trump
తమ దేశంలో అక్రంగా నివసిస్తున్న వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ఒకటి ప్రకటించారు. ఈ అక్రమ వలసదారులు స్వచ్చందంగా తమ దేశాలకు వెళ్లిపోయేందుకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు కూడా ఇస్తామని ప్రటించారు. ఈ తరహా నిర్ణయం తీసుకోవడాని ప్రధాన కారణం... అక్రమ వలసదారులను తమ దేశం నుంచి వెళ్లగొట్టడమే ప్రథమ లక్ష్యమని తెలిపారు. తమ దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అధికారులు దృష్టిసారించారని తెలిపారు. 
 
రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన నాటి నుంచి డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో పలు దేశాలకు చెందిన వందలాది మంది అక్రమ వలసదారులను అమెరికా నుంచి వారి స్వదేశాలకు పంపించారు. అయితే, తాజాగా అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అక్రమంగా ఉంటూ స్వీయ బహిష్కరణ చేసుకోవాలనే వారికి విమాన ఖర్చులతో పాటు కొంత నగదు కూడా అందిస్తామని ఆయన ప్రకటించారు. 
 
ట్రంప్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారులు దృష్టిసారించామని పేర్కొన్న ట్రంప్... చట్ట విరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయ బహిష్కర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, సముచితమని భావిస్తే వారు చట్టపద్ధతిలో వెనక్కి తిరిగి రావడానికి అనుమతి కూడా ఇస్తామని డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.