గాడిదలకు డైపర్ వేయాల్సిందే.. లేదంటే దేశంలోకి అనుమతి నిషేధం!
కెన్యాలోని ఓ నగర పాలక వర్గం గాడిదలకు కనివిని ఎరుగని వింత ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాలను ధిక్కరిస్తే మాత్రం నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించింది. ఇంతకీ ఆ ఆదేశం ఏంటో తెలిస్తే నవ్వాలో... ఏడ్వాలో అర్థం కాదు... ఇకమీదట నగరంలోకి వచ్చే ప్రతీ గాడిద ఖచ్చితంగా డైపర్ వేసుకోని సిటీలోకి రావాల్సిందే... లేదంటే అనుమతించేది లేదని వెల్లడించింది.
అసలు విషయం ఏంటంటే... కెన్యాలోని వాజిర్ నగర ప్రజలు ఎక్కువగా రవాణ, వ్యాపారం, అన్ని అవసరాల కోసం గాడిదలనే విరివిగా ఉపయోగిస్తుంటారు. అందుకే అక్కడ మనుషుల సంఖ్య కంటే గాడిదలు ఎక్కువగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఇంతవరకు బాగానే ఉందిగానీ ఆ గాడిదలతో ఆ నగరానికి పెద్ద చిక్కొచ్చిపడింది.
ఇటీవలే ఆ నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొత్తగా రోడ్లు వేశారు. అయితే ఈ గాడిదలు ఎక్కడ పడితే అక్కడ మల, మూత్ర విసర్జన చేస్తుండడంతో ఆ రోడ్లన్నీ వేసిన రెండ్రోజులకే పాడైపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే నడవడానికి కూడా వీలు లేకుండా మలినాలతో పూర్తిగా నిండిపోతున్నాయి.
ఈ సమస్యను అరికట్టడానికే గాడిదలకు తప్పనిసరిగా డైపర్స్ వేయాలని వాటి యజమానులను నగర పాలక సంస్థ ఆదేశించింది. లేకపోతే వాటిని నగరం లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించింది. నిజంగా ఇది మనదేశంలో అమలు చేస్తే బాగుంటుందనిపిస్తుంది కదూ.!