శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (10:10 IST)

ట్రంప్‌కు చైనాలో సీక్రెట్ ఖాతాలు... సహకరించ దేశాలకు చుక్కలు చూపిస్తాం : జో బైడెన్

ఈ చివరి ముఖాముఖి చర్చలో జో బైడెన్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎన్నికల్లో గెలవబోయేది తానేనని, డోనాల్డ్ ట్రంప్ గెలవాలని భావిస్తూ, ఆయనకు సహకరించే దేశాలు సమీప భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని బాహాటంగానే హెచ్చరికలు చేయడం గమనార్హం. 
 
'నేను ఒకటే విషయాన్ని నేడు చాలా స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను. యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో కలుగజేసుకునే ఏ దేశమైనా మూల్యం చెల్లించాల్సిందే. రష్యా, చైనాతో పాటు ఎన్నో దేశాల్లో ట్రంప్‌కు వ్యాపారాలు ఉన్నాయి. 
 
రష్యా నుంచి భారీగా డబ్బులు వస్తున్నాయి. చైనాలో ట్రంప్‌కు రహస్య ఖాతాలు ఉన్నాయి. నేను ఒక్క దేశం నుంచి కూడా ఒక్క పైసా తీసుకోలేదు. ట్రంప్‌కు సహకరించే దేశాలు ఇబ్బందులు పడతాయి'  అని బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. 
 
అయితే జో బైడెన్‌ వ్యాఖ్యలను డోనాల్డ్ ట్రంప్ అక్కడే ఖండించారు. బైడెన్‌కు ధీటుగా సమాధానం చెప్పారు. 'బైడెన్‌కు రష్యా నుంచి మిలియన్ల డాలర్ల కొద్దీ సాయం అందుతోంది. కరోనాకు కారణం చైనా దేశమే. యూఎస్ కరోనాను నియంత్రించింది. మరణాల రేటు చాలా తగ్గిపోయింది. 
 
కరోనాకు వ్యాక్సిన్‌ను తీసుకుని వచ్చేందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిల్లో అమెరికా ముందుంది. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేసులు అధికంగా ఉన్నాయి. త్వరలోనే వ్యాక్సిన్‌ను తీసుకుని వస్తాం. సైన్యం సాయంతో వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తాం' అని చెప్పుకొచ్చారు.