శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (12:06 IST)

హైతీ దేశాధ్యక్షుడు మోసీ దారుణ హత్య

కరేబియన్ దేశాల్లో ఒకటైన హైతీ దేశాధ్యక్షుడు జొవెనెల్ మోసీ దారుణ హత్యకుగురయ్యారు. ఆయన నివాసంలోనే ఆయనను దుండగులు దారుణంగా హతమార్చారు. 
 
ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆయన, ఆయన భార్యపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మోసీ మృతి చెందారు. ఆయన భార్య మార్టిన్ మోసీ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ హత్యను హైతీ తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. ఇదొక దుర్మార్గపు, అమానవీయ చర్య అని ఆయన అన్నారు. మరోవైపు అధ్యక్షుడు హత్యకు గురయ్యారనే వార్తతో ఆ దేశ ప్రజలు ఉలిక్కి పడ్డారు. 
 
ఈ హత్యతో దేశంలో హింస చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తాత్కాలిక ప్రధాని తెలిపారు. 
 
హత్యపై సమగ్ర దర్యాప్తును జరుపుతున్నామని చెప్పారు. హైతీలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ గ్యాంగ్ వార్‌‌లు కూడా ఎక్కువయ్యాయి.