శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (23:35 IST)

హైతీలో హింస: ఏకంగా దేశాధ్యక్షుడినే కాల్చి చంపేశారు..!

Haiti President
కరీబియన్ కంట్రీ హైతీలో హింస పెట్రేగింది. ఏకంగా దేశాధ్యక్షుడు జొవెనల్ మొయిస్‌నే కాల్చి చంపేశారు. మంగళవారం రాత్రి కొందరు దుండగులు అధ్యక్షుడు మొయిస్ వ్యక్తిగత నివాసంలో మారణాయుధాలతో చొరబడ్డారు. అనంతరం ఆయనను తుపాకీతో కాల్చి చంపినట్టు దేశ ప్రధాని క్లాడ్ జోసెఫ్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

దేశ ప్రథమ మహిళ, మొయిస్ సతీమణి మార్టిన్ మొయిస్‌కూ తీవ్రగాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతున్నదని వివరించారు. ఇది అనాగరిక, విద్వేషపూరిత చర్యగా ఆయన పేర్కొన్నారు.
 
ప్రస్తుతం పరిస్థితులు పోలీసుల అదుపులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కొనసాగడానికి, శాంతి భద్రతలు కాపాడటానికి నిర్విరామ ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. హైతీ దేశంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దిగజారాయి. పేదరికం, రాజకీయ విభేదాలతో దేశం రెండుగా చీలింది. రాజకీయ ప్రేరేపిత హత్యలు పెచ్చరిల్లాయి. హంతకముఠాలు వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి.
 
వీటిని అదుపులో పెట్టడానికి పోలీసులు నిమగ్నమయ్యారు. దీంతో రాజధాని సహా పలుపట్టణాలు తూటాల చప్పుళ్లతో దద్దరిల్లుతున్నాయి. 2017లో మొయిస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆయన నియంతపాలన వైపు దేశాన్ని మరలిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.