గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 3 జులై 2021 (17:36 IST)

భాషతోనే సంస్కృతి, సంస్కృతితోనే సమాజం: ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌

కళలు, జీవన విధానాలు, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు మ‌న సంస్కృతిలో భాగాల‌ని, భాషను కాపాడుకుంటేనే, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోగలమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. సాంస్కృతిక కళాసారధి- సింగపూర్ సంస్థ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు.
 
భారతీయ సంస్కృతిని ఖండాంతరాలకు మోసుకువెళ్ళి అక్కడ మన అచారాలు కట్టుబాట్లు పాటిస్తూ, సంస్కృతిలోని గొప్పతనాన్ని తెలియజేస్తున్న ప్రవాస భారతీయుల్ని సాంస్కృతిక వారధులుగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, వారంతా ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా మార్చేశారని, వారి పాత్రను చూసి మాతృభూమి గర్విస్తోందని తెలిపారు. పశువులు, చెట్లు, నదులను పూజించే భారతీయు సంప్రదాయం ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. పేదలకు సాయం చేయడానికి భారతీయులు ధర్మంగా భావించారన్న ఉపరాష్ట్రపతి, మన జాతరలు, ఉత్సవాలు, తిరునాళ్ళు అందరూ కలిసి మెలసి జీవించడానికి సాయపడ్డాయని, ఇవన్నీ మన సంస్కృతి గొప్పతనాన్ని కళ్ళకు కడతాయని పేర్కొన్నారు. 
 
భారతదేశం అనేక భాషలు, సంస్కృతుల నిలయమన్న ఉపరాష్ట్రపతి, భిన్నత్వంలో ఏకత్వం మనందరినీ కలిపి ఉంచిందని, మనిషి మారినా సంస్కృతిని మరచిపోలేదని, మనిషి ఆదర్శవంతంగా జీవించడానికి సంస్కృతి దోహదం చేస్తుందని తెలిపారు. ఖండంతరాలు దాటినా నేటికీ మన సంస్కృతిని కాపాడుకుంటున్న ప్రవాస భారతీయులకు అభినందనలు తెలిపారు.
మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు. వ్యాపార సంబంధాలు భాష లేకుండా పెంపొందలేవని పేర్కొన్నారు.
 
 మాతృభాషలో చదివితే ఎదగలేమనే అపోహ ప్రజల్లో ఉందని, భారతదేశ రాష్ట్రపతి మొదలుకుని ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలా అందరూ మాతృభాషలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగిన వారే అనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. మాతృభాషను కాపాడుకునే దిశగా పంచ సూత్రాలను ఉపరాష్ట్రపతి ప్రతిపాదించారు. ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడడం, పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం, న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో అందించడం, క్రమంగా సాంకేతిక విద్యలో మాతృభాషల వినియోగం పెరగడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రెండు వారాలకు ఓ భాష అంతరించిపోతోందని ఐక్యరాజ్యసమితి నివేదికలను ఉటంకించిన ఉపరాష్ట్రపతి, అందులో 196 భాషలు భారతదేశానివే ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో భాషను, సంస్కృతిని కాపాడుకోవాలని, ఇందు కోసం దేశవిదేశాల్లో ఉన్న భారతీయులంతా సంఘటితమై ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
 
కార్యక్రమంలో ప్రారంభంలో ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందించిన కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామికి ఉపరాష్ట్రపతి ప్రణామాలు అర్పించారు. పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు ప్రజల్లోకి వెళ్ళి వారి ఒత్తిళ్ళను తొలగించేందుకు ఆధ్యాత్మికతను, సంస్కృతిని, ధర్మాన్ని వ్యాప్తి చేయాలని, అన్ని వర్గాల ప్రజలను తమ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయాలని ఆకాంక్షించారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ మాధవ్, మాజీ ఎంపీ శ్రీ మురళీమోహన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్నకుమార్, వివిధ దేశాలకు చెందిన భాషాభిమానులు, భాషావేత్తలు తదితరులు  పాల్గొన్నారు.