సారీ చెప్పిన గూగుల్.. ఎవరికి.. ఎందుకు?
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ క్షమాణలు కోరింది. భారతదేశంలో వికారమైన భాష ఏది అంటూ ఇటీవల గూగుల్‌లో సెర్చ్ చేస్తే 'కన్నడ' అని ఫలితం వచ్చింది. దీనిపై కన్నడిగులు తీవ్రంగా మండిపడుతున్నారు. పైగా, కన్నడం భాష నెటిజన్‌లకు సులువుగా ఉండదని కూడా గూగూల్ చూపిస్తోంది.
దీనిపై గూగుల్ సంస్థ క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో నివసిస్తున్నవారితోపాటు, దేశవిదేశాల్లో నివసిస్తున్న కన్నడిగులు సైతం ట్విటర్‌లో దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అలాంటి వెబ్‌సైట్లను పైన ఉంచడాన్ని తప్పుబడుతున్నారు. ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సైతం దీనిపై స్పందించారు. దీనిపై గూగుల్ సంస్థకు లీగల్ నోటీసు పంపిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో దిగివచ్చిన గూగుల్... ఆ సంస్థకు చెందిన ప్రతినిధితో ప్రకటన చేయించింది. ఈ తప్పును సరిచేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అది తమ అభిప్రాయం కాదని వివరణ ఇచ్చారు. పైగా, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణ తెలిపారు.