శుక్రవారం, 7 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2016 (10:40 IST)

ఓరి వీడి దుంపతెగా... కన్న కూతురునూ వదలని డోనాల్డ్ ట్రంప్.. ఆమె అందంపై అశ్లీల వ్యాఖ్యలు

నిత్యం వివాదాలతో సహజీవనం చేసే రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ముందుండే ట్రంప్.. ఇపుడు ఏకంగా కన్నబిడ్డ అందంపైనే

నిత్యం వివాదాలతో సహజీవనం చేసే రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ముందుండే ట్రంప్.. ఇపుడు ఏకంగా కన్నబిడ్డ అందంపైనే అశ్లీల వ్యాఖ్యలు చేశారు. ఆరడుగుల తన కుమార్తె దేహ సౌష్టవం గురించి ఓ తండ్రి వర్ణించలేని రీతిలో వర్ణించి తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారు. అప్పుడెప్పుడో ఆయన చేసిన వ్యాఖ్యల టేపులు ఇటీవల బహిర్గతమయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయనపై విమర్శల జడివాన కురుస్తోంది. 
 
వాస్తవానికి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు శనివారం వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఆయన ప్రభ మసకబారడం ఆరంభమైంది. ఆయన నమ్మిన వారు సైతం దూరమైపోతున్నారు. దీంతో భర్త కోసం ఆయన భార్య రంగంలోకి దిగింది. తన భర్తను తాను క్షమించినట్టుగానే దేశ ప్రజలు కూడా క్షమించాలని వేడుకుంది. 
 
ఇంతలోనే కన్నకూతురిపై ట్రంప్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. పలుమార్లు కుమార్తెపై చేసిన అసభ్యకర వాఖ్యలను సీఎన్ఎన్ బయటపెట్టడంతో తీవ్ర దుమారం రేగింది. అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముడుతున్నా ట్రంప్ మాత్రం పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు.
 
మరోవైపు.. ఎన్నికలు కీలక దశకు చేరుకుంటున్న దశలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు మద్దుతు ఇచ్చే ప్రసక్తే లేదని, ఆయన స్థానంలో మరొకరిని ప్రకటించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెపుతున్నారు.