ఉక్రెయిన్‌లో రష్యా దాష్టికం - దర్యాప్తునకు భారత్ డిమాండ్
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా భారత్ గళం విప్పింది. ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో రష్యా సైనిక బలగాలు సృష్టించిన మారణహోమం (హత్య)పై స్వంతంత్ర దర్యాప్తునకు డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ తన వాదనను వెలుబుచ్చింది.
నిజానికి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడాన్ని అనేక ప్రపంచ దేశాలు ఏమాత్రం సమ్మతించడం లేదు. తమ మాటను పెడచెవిన పెట్టిన రష్యాను దారికి తెచ్చేందుకు అనేక రకాలైన ఆర్థికా ఆంక్షలను విధించాయి. అయితే, భారత్ మాత్రం ఈ తరహా చర్యలకు పాల్పడలేదు. దీనికి కారణం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, స్నేహబంధం బలంగా ఉండటమే.
కానీ, ఉక్రెయిన్‌పై దండయాత్ర కోసం వచ్చిన రష్యా సైనిక బలగాలు తొలుత ప్రవేశించిన నగరం బుచానే. ఇక్కడ రష్యా సేనను ఉక్రెయిన్ వాసులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు. మహిళలపై అత్యాచారాలు చేశారు. చిన్నారులను హతమార్చారు. రష్యా బలగాలు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి మాట్లాడుతూ, భద్రతా పరిస్థితులు దిగజారాయని ఆరోపించారు. బుచాలో జరిగిన పౌర హత్యలపై వస్తున్న వార్తలు ఎంతో కలతకు గురి చేస్తున్నాయని, వీటిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.