బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 18 మార్చి 2022 (20:16 IST)

యుక్రెయిన్ యుద్ధం: ‘జెలియెన్‌స్కీతో ఫేస్‌ టు ఫేస్’ - శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిమాండ్లు ఇంకా ఏంటంటే..

రష్యా, యుక్రెయిన్‌ల మధ్య సంక్షోభంలో మధ్యవర్తిత్వం నెరపటానికి టర్కీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వచ్చింది. ఆ దేశం కృషి ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. యుక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటే రష్యా డిమాండ్లు ఏమిటనేది నిర్దిష్టంగా చెప్పారు.

 
ఆ ఫోన్ కాల్ ముగిసిన అరగంటలో ఎర్డోగన్ ప్రధాన సలహాదారు, అధికార ప్రతినిధి ఇబ్రహీం కాలిన్‌ను నేను ఇంటర్వ్యూ చేశాను. పుతిన్, ఎర్డోగన్‌ల మధ్య ఫోన్ సంభాషణను విన్న అతి కొద్ది మంది ఉన్నతస్థాయి బృందంలో ఇబ్రహీం కూడా ఉన్నారు. రష్యా డిమాండ్లు రెండు వర్గాలుగా చెప్పవచ్చు. మొదటి నాలుగు డిమాండ్లను నెరవేర్చటం యుక్రెయిన్‌కు పెద్ద కష్టమేమీ కాదని ఇబ్రహీం వ్యాఖ్యానించారు.

 
వాటిలో ముఖ్యమైనది.. యుక్రెయిన్ తటస్థంగా ఉండాలి, నాటోలో చేరటానికి దరఖాస్తు చేయకూడదు. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ ఇప్పటికే దీనికి అంగీకరించారు. ఈ వర్గంలో ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి కానీ అవి ప్రధానంగా రష్యా తన పరువు దక్కించుకోవటానికి ముందుపెట్టిన అంశాలుగానే కనిపిస్తున్నాయి.

 
యుక్రెయిన్.. తన నుంచి రష్యాకు ముప్పులేకుండా ఉండేలా నిరాయుధీకరణ ప్రక్రియను అమలు చేయాలి. యుక్రెయిన్‌లో రష్యన్ భాషకు రక్షణ ఉండాలి. ఇక డీ-నాజిఫికేషన్ - అంటే నాజీయిజాన్ని తొలగించటం - అనే అంశం కూడా ఉంది. ఇది జెలియెన్‌స్కీని తీవ్రంగా అవమానించే అంశం. ఆయన స్వయంగా ఒక యూదు. ఆయన బంధువులు హిట్లర్ సాగించిన యూదు మారణహోమంలో చనిపోయారు. అయితే ఈ డిమాండ్‌కు అంగీకరించటం జెలియెన్‌స్కీకి ఈజీయే అవుతుందని టర్కీ భావిస్తోంది.

 
రెండో వర్గం డిమాండ్లను ఆమోదించటంలోనే కష్టం ఉంటుంది. ఈ అంశాలపై ఒప్పందానికి వచ్చే ముందు జెలియెన్‌స్కీతో తాను ముఖాముఖి చర్చలు జరపాల్సి ఉంటుందని పుతిన్ టర్కీ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు. రష్యా అధ్యక్షుడిని నేరుగా కలిసి, ముఖాముఖి చర్చలు జరపటానికి తాను సిద్ధమని జెలియెన్‌స్కీ ఇప్పటికే చెప్పారు. ఈ డిమాండ్ల గురించి ఇబ్రహీం నిర్దిష్టంగా చెప్పలేదు కానీ.. ఇప్పటికే యుక్రెయిన్ నుంచి విడిపోయిన తూర్పు ప్రాంతంలోని డోన్బాస్ హోదా, క్రైమియా హోదాకు సంబంధించిన అంశాలని తెలిపారు.

 
ఆయన వివరంగా చెప్పనప్పటికీ.. తూర్పు యుక్రెయిన్‌లోని భూభాగాన్ని వదులుకోవాలని రష్యా డిమాండ్ చేస్తుందని భావిస్తున్నారు. అది చాలా వివాదాస్పదమైన అంశమవుతుంది. ఇక రష్యా 2014లో అక్రమంగా తనలో కలుపుకున్న క్రైమియాకు సంబంధించి.. ఆ ప్రాంతం రష్యాకే చెందుతుందని యుక్రెయిన్ అధికారికంగా అంగీకరించాలని కూడా రష్యా డిమాండ్ చేస్తుందని భావిస్తున్నారు. ఇదే నిజమైతే అది యుక్రెయిన్‌కు మింగుడుపడని అంశమే అవుతుంది.

 
ఏదేమైనా.. అది జరిగిపోయింది. క్రైమియాను సొంతం చేసుకునే హక్కు రష్యాకు లేకపోయినప్పటికీ, సోవియట్ పతనం తర్వాత, పుతిన్ అధికారంలోకి రాకముందు.. ఆ ప్రాంతం యుక్రెయిన్‌లో భాగమని అంగీకరిస్తూ అంతర్జాతీయ ఒప్పందం మీద రష్యా సంతకం చేసినప్పటికీ.. క్రైమియాను రష్యా కలిపేసుకుంది. అయినప్పటికీ.. పుతిన్ డిమాండ్లు చాలామంది భయపడినంత కఠినంగా లేవు. ఈ డిమాండ్ల కోసం యుక్రెయిన్‌ మీద రష్యా పాల్పడుతున్న ఈ హింస, రక్తపాతం, విధ్వంసం అవసరం లేదని అనిపిస్తుంది.

 
రష్యా మీడియా మీద పుతిన్ పూర్తి నియంత్రణ ఉంది కాబట్టి.. ఇదంతా ఓ భారీ విజయమని చాటుకోవటానికి ఆయనకు, ఆయన సేవకులకు పెద్ద కష్టం కాకూడదు. కానీ యుక్రెయిన్‌లో అయితే చాలా ఉద్వేగాలు, ఉద్రేకాలు తలెత్తుతాయి. ఏ ఒప్పందమైనా కానీ.. సూక్ష్మ వివరాలను కూడా అత్యంత జాగ్రత్తగా తేల్చుకోకపోతే.. పుతిన్ కానీ, ఆయన తర్వాత వచ్చే రష్యా పాలకులు మళ్లీ యుక్రెయిన్ మీద దండెత్తటానికి దానిని సాకుగా వాడుకోవచ్చు. ఒకవేళ తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించటం ద్వారా రక్తపాతం ఆగినప్పటికీ.. శాంతి ఒప్పందం ఖరారు కావటానికి చాలా సమయం పట్టవచ్చు.

 
యుక్రెయిన్ గత కొన్ని వారాల్లో దారుణంగా దెబ్బతిన్నది. రష్యా ధ్వంసం చేసిన నగరాలు, పట్టణాలను పునర్నిర్మించటానికి చాలా కాలం పడుతుంది. ఇళ్లు వదిలి పారిపోయిన లక్షలాది మంది శరణార్థులకు వాళ్లు తిరిగివచ్చి నివసించటానికి కూడా చాలా కాలం పడుతుంది.

 
మరి వ్లాదిమిర్ పుతిన్ సంగతేమిటి? ఆయన అనారోగ్యంగా ఉన్నారనే సూచనలు అందుతున్నాయి. మానసికంగా స్థిరంగా లేకపోవచ్చని కూడా సూచిస్తున్నారు. ఎర్డోగన్‌తో పుతిన్ ఫోన్‌లో మాట్లాడినపుడు ఆ సంభాషణ విన్న ఇబ్రహీం.. అలాంటిదేమైనా విన్నారా? అస్సలేమీ లేదని ఆయన బదులిచ్చారు. పుతిన్ తను చెప్పిన ప్రతి అంశం విషయంలో చాలా స్పష్టంగా, సంగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. యుక్రెయిన్‌తో ఒప్పందం.. నయా నాజీయిజం మీద సాధించిన అద్భుత విజయంగా చాటుకోగలిగినప్పటికీ.. స్వదేశంలో ఆయన పరపతి బలహీనపడుతుందనటంలో సందేహం లేదు.

 
ఆయన తనను తానే ఘోరంగా ఓడించుకున్నట్లు మరింతమంది జనం తెలుసుకుంటూ ఉంటారు. యుక్రెయిన్‌లో రష్యా సైనికులు చనిపోతున్న ఉదంతాలు, బందీలుగా పట్టపడుతున్న కథలు ఇప్పటికే వేగంగా వ్యాపిస్తున్నాయి.