శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కీవ్‌ నగరంలో రష్యా మారణహోమం - 15 కిమీ దూరంలో బలగాలు

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్ర బుధవారానికి 20వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే ఉక్రెయిన్ దేశాన్ని సర్వనాశనం చేసిన రష్యా సైనిక బలగాలు ఇపుడు ఆ దేశ రాజధాని కీవ్ నగరంలో మారణహోమం సృష్టిస్తున్నాయి. తమ ప్రవేశాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ దేశ పౌరులను పిట్టల్లా కాల్చేస్తున్నారు. 
 
బాంబుల వర్షం, క్షిపణులతో దాడి చేస్తున్నారు. దీంతో కీవ్ నగరం మరణభూమిని తలపిస్తుంది. అదేసమయంలో రష్యా సైనిక బలగాలు ఈ నగరానికి 15 కిలోమీటర్ల దూరం చేరువకు వచ్చారు. అంటే ఏ క్షణమైనా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. 
 
అదేసమయంలో కీవ్ నగరంపై బాంబుపు, క్షిపణులతో దాడులు చేస్తున్నారు. ఫలితంగా ఆ నగరం దద్ధరిల్లిపోతోంది. ఓ 15 అంతస్తుల భవనంపై జరిగిన బాంబు దాడితో ఆ భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు భవనంలోనే చిక్కుకునిపోయారు. 
 
అలాగే, ఓ విశ్వవిద్యాలయం, ఓ మార్కెట్‌పై కూడా దాడి చేయగా, పది మంది చనిపోయారు. అంతేకాకుండా, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న బస్సును కూడా రష్యా సేనలు వదిలిపెట్టలేదు. ఖేర్సన్ నగరంలో రష్యా సేనలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. 
 
ఇదిలావుంటే, కీవ్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలు ఉన్నాయి.  ఈ దూకుడును బట్టి చూస్తే మరో రెండు మూడు రోజుల్లోనే కీవ్ నగరం రష్యా సేనల సొంతమయ్యే అవకాశం లేకపోలేదు.