భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు
దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ విమానాలు తన గగనతలాన్ని ఉపయోగించకుండా నిషేధాన్ని పొడగించింది. ఆగస్టు 23వ వరకు పాక్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్ (ట్విట్టర్)లో ఈ విషయాన్ని తెలియజేశారు.
“పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా పరిమితం చేస్తున్న ఎయిర్ లైన్ నోటీసు (NOTAM)ను అధికారికంగా ఆగస్టు 23 వరకు పొడిగించడం జరిగింది. ప్రస్తుత భద్రతా ప్రోటోకాలు అనుగుణంగా ఇది ఉంటుంది" అని మంత్రి తెలిపారు.
దాయాది దేశం తన గగనతలంలో భారతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ గత వారం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి భారత్ ఈ చర్య తీసుకుంది. ఆగస్టు 24 వరకు భారత ఎయిర్ లైన్స్ బ్యాన్‌ను పొడిగించినట్లు పాకిస్థాన్ ఎయిర్ పోర్టు అథారిటీ (పీఏఏ) గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలన్నింటికీ వర్తిస్తుందని తెలిపింది. ఈ బ్యాన్ ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) అమలులో ఉంటుందని పీఏఏ తెలియజేసింది.