లడాఖ్: భారత్-చైనా దళాల ఉపసంహరణ.. ఫోటోలు వైరల్
లడాఖ్‌లోని సరిహద్దు నుంచి భారత్, చైనా దళాలు ఉపసంహరించుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత 10 నెలల నుంచి సరిహద్దు ప్రాంతాల్లో మోహరించి ఉన్న దళాలు తిరిగి వెనక్కి వెళ్తున్న దృశ్యాలను ఇవాళ భారత ఆర్మీకి చెందిన నార్తర్న్ కమాండ్ రిలీజ్ చేసింది. గత ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన తర్వాత.. ఇండోచైనా బోర్డర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.
దానిలో భాగంగా రెండు దేశాలు ఆ ప్రాంతంలో తమ దళాలను మోహరించాయి. అయితే పలు దఫాలుగా రెండు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా రెండు దేశాల సైనికులు వివాదాస్పద ప్రాంతం నుంచి వెనుదిరుగుతున్నారు. ఈస్ట్రన్ లడాఖ్‌లోని పాన్‌గాంగ్ సరస్సు వద్ద నుంచి చైనా దళాలు, ట్యాంకర్లు ఉపసంహరించాయి. దానికి సంబంధించిన ఫోటోలను ఇవాళ ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.