బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (15:20 IST)

రేటు అదిరిపోయింది... ఆ చేప ధర రూ.21 కోట్లు...

చేపల్లో అనేక రకాల చేపలు ఉన్నాయి. చేపల రకాలను బట్టి వాటి ధరలు కూడా ఉంటాయి. మనకు తెలిసిన చేపల్లలో పులస చేప ఎక్కువ ధర పలుకుతుంది. ఈ చేపను ఆరగించేందుకు నాన్‌వెజ్ ప్రియులు అమితంగా ఇష్టపడతారు. అయితే, చేపల ధరలు కేవలం మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా భారీగానే పలుకుతున్నాయి.
 
తాజాగా జపాన్ దేశంలో ఓ చేపల వ్యాపారి ఏకంగా 21 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ చేపను కొనుగోలు చేశారు. ఈ చేప పేరు బ్లూఫిన్ టూనా. ఈ చేపకు జపాన్ దేశంలో మంచి పేరుంది. పైగా, ఆ దేశంలో లభ్యమయ్యే అరుదైన చేప కూడా. అందుకే దీని ధర కూడా భారీగానే ఉంటుంది. 
 
జపాన్ రాజధాని టోక్యోలోని ప్రపంచ ప్రఖ్యాత సుకిజీ చేపల మార్కెట్ ఉంది. ఇక్కడ ప్రతి యేడాది కొత్త సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున అరుదైన చేపల వేలం పాటలు నిర్వహిస్తారు. ఈ యేడాది ఇదేవిధంగా వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో 278 కిలోల భారీ బ్లూఫిన్‌ టునా చేప ఏకంగా రూ.21 కోట్లు పలికింది. 
 
టునా చేపలను ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసే స్థానిక సుషీ రెస్టారెంట్ల యజమాని కియోషీ కిమురానే ఈ సారి కూడా బ్లూఫిన్‌ టునాను దక్కించుకున్నారు. తాజాగా జరిగిన వేలంలో ఈ చేపను 333.6 మిలియన్‌ యన్‌లకు(భారత కరెన్సీలో దాదాపు రూ.21 కోట్లు) కిమురా కొనుగోలు చేసి రికార్డు పుటలకెక్కాడు. 
 
ఈయన గత 2013 సంవత్సరంలో జరిగిన వేలం పాటల్లో కూడా 155 మిలియన్‌ యన్‌లను(భారత కరెన్సీలో దాదాపు రూ.9 కోట్లు) చెల్లించి టునా చేపను కొనుగోలు చేశారు. జపాన్ రెస్టారెంట్లలో టూనా చేప ముక్క ధర కూడా రూ.వేలల్లో పలుకుతుంది.