గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (11:15 IST)

యావత్ దేశం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉంది : అమెరికా అధ్యక్షుడు బైడెన్

joe biden
అమెరికా  పూర్వ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై దుండగుడు జరిపిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంట సమయంలోనే యావత్ దేశం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ, "ఇలాంటి హింసాయుత ఘటనలకు అమెరికాలో చోటులేదు. పెన్విల్వేనియాలోని  ట్రంప్‌ ర్యాలీలో జరిగిన కాల్పుల ఘటనపై నాకు సమాచారం వచ్చింది. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసి నా మనసు కుదుటపడింది. ఆయన్ని కాపాడిన సీక్రెట్‌ సర్వీస్‌కి నా ధన్యవాదాలు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ర్యాలీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండా లని ప్రార్థిస్తున్నా. ఇలాంటి ఘటనల్ని ఖండించటంలో యావత్‌ దేశం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు.
 
అలాగే, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మాట్లాడుతూ, "ట్రంప్‌పై జరిగిన కాల్పుల్లో ఆయనకు పెద్దగా ప్రమాదమేమీ జరగలేదని తెలిసి ఊరట చెందాను. ఆయనతో పాటు ఈ కాల్పుల్లో గాయపడిన వారందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం. ట్రంప్‌ను కాపాడిన సీక్రెట్‌ సర్వీస్‌ సహా ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు. ఇలాంటి హింసకు అమెరికాలో స్థానం లేదు. మనందరం ఈ అసహ్యకరమైన చర్యను ఖండించాలి. ఇది మరింత హింసకు దారితీయకుండా చూసేందుకు మన వంతు కృషి చేయాలి" అని పేర్కొన్నారు.
 
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ, "మన ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు అస్సలు చోటు లేదు. ట్రంప్‌నకు తీవ్ర గాయాలేమీ కాలేదని తెలిసి ఉపశమనం పొందాం. నాగరికత, గౌరవంతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉంటామని మరోసారి ప్రతిజ్ఞ చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుందాం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం" అని పేర్కొన్నారు. 
 
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ మాట్లాడుతూ, 'తనపై జరిగిన పిరికిపందల దాడి నుంచి ట్రంప్‌ సురక్షితంగా బయటపడ్డారని తెలిసి నేను, నా సతీమణి లారా ఊరటచెందాం. వేగంగా స్పందించి ఆయన్ని కాపాడిన సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బందిని అభినందిస్తున్నాం' అని అభిప్రాయపడ్డారు.