నల్ల చిరుతతో సెల్ఫీకి యత్నించిన లేడీ... ఏమైందో చూడండి
యువత ప్రస్తుతం సెల్ఫీల కోసం ఎక్కడలేనంతగా రిస్క్ చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎక్కడ ఏమి చేసిన ఫోటో క్లిక్‌మనిపించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటం వారికి అలవాటుగా మారింది. లైక్‌లు, కామెంట్‌లు అంటూ ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. కొంతమంది రన్నింగ్ ట్రైన్‌లలో, మరికొంతమంది ఎత్తైన కొండలు, జలపాతాలు వంటి ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
వీళ్లలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఆరిజోనాలో ఓ యువతి ఇలాంటి రిస్కే చేసింది. జూలో చిరుతతో సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంది. లిచ్‌ఫీల్డ్ పార్క్‌లోని జూలో ఓ యువతి నల్ల చిరుతతో సెల్ఫీ దిగేందుకు సరదా పడింది. అయితే దూరం నుండి ఫోటో తీసుకోకుండా, అతి దగ్గరగా వెళ్లి అక్కడున్న ఫెన్సింగ్ ఎక్కింది. కెమెరాను ఓపెన్ చేసి ఫోజిచ్చే సమయంలో వెనుక వైపు నుండి చిరుత దాడి చేసింది. ఆమె చేతిపై పంజా విసిరి గోళ్లతో రక్కేసింది. దీంతో గట్టిగా కేకలు వేసింది.
ఇంతలో అక్కడ ఉన్న ఓ మహిళ సమయస్ఫూర్తితో చిరుత దృష్టిని మళ్లించేందుకు బోను లోపలికి బాటిల్ విసిరేసింది. ఏదో పడిందని గుర్తించిన చిరుత, బాటిల్ దగ్గరకు వెళ్లింది. అప్రమత్తంగా ఉన్న ఇతర సందర్శకులు చాకచక్యంగా ఆ యువతిని వెనక్కి లాగేసారు. దాంతో ప్రాణాలతో బయటపడింది. స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. అయితే ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషియల్ మీడియాలో వైరల్‌గా మారింది.