బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (13:11 IST)

ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదాం.. మోదీ, జిన్ పింగ్ నిర్ణయం

ఉగ్రవాదంపై కలిసి కట్టుగా పోరాడాలని మోదీ, జిన్ పింగ్ నిర్ణయించారు. భారత పర్యటనకు వచ్చిన చైనా అధినేత జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి మహాబలిపురంలోని సముద్రతీర రిసార్టులో ప్రైవేటు విందు ఇచ్చారు. దాదాపు రెండున్నర గంటల సేపు విందు సమావేశం సాగింది.

ఇద్దరు నేతలూ వివిధాంశాలపై పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. ‘‘పెరిగిపోతున్న తీవ్రవాద, విపరీత ధోరణుల వల్ల రెండు దేశాలూ ఇబ్బంది పడుతున్నాయనీ, సమాజానికి చేటు చేస్తున్న వాటిపై కలిసి పోరాడుదామనీ ఇద్దరూ నిర్ణయానికొచ్చారు.

ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదామని నిశ్చయించారు. వాణిజ్య పరిమాణాన్ని పెంపొందించేందుకు, ముఖ్యమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
 
ఈ చర్చల్లో వ్యక్తిగత స్నేహం వెల్లివిరిసింది. దాదాపు ఐదుగంటల పాటు ఇద్దరు నేతలూ కలిసి ఉన్నారు’’ అని విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే మీడియాకు చెప్పారు. సహకారాన్ని పెంపొందించుకొని బంధాన్ని పటిష్టం చేసుకోడానికి ఏఏ చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా చర్చించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.

రెండురోజుల కిందట పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బీజింగ్‌ వెళ్లి కశ్మీర్‌పైనా, భారత వైఖరిపైనా జిన్‌పింగ్‌కు వివరించి వచ్చారు. చైనా కూడా భారత్‌ పట్ల కాస్త అసహన ధోరణిని, అసంతృప్తిని కనబర్చింది. తాజా భేటీ ద్వారా మోదీ చైనాకు భారత్‌ పట్ల ఉన్న ప్రతికూలతను తగ్గించే యత్నం చేశారని దౌత్యవర్గాలు తెలిపాయి.

అయితే ఈ విందు బల్ల వద్ద అగ్రనేతలిద్దరు మాత్రమే కూర్చున్నారు. విందుకు అతి ముఖ్యమైన చెరో ఎనిమిది మందిని మాత్రమే ఆహ్వానించారు. వారు ఈ అగ్రనేతలు కూర్చున్న ప్రదేశానికి కాస్తంత దూరంగా విడిగా కూర్చున్నారు.

కశ్మీర్‌ అంశం, పాకిస్థాన్‌ వ్యవహార శైలి... మొదలైన వివాదాల లోతుకు మోదీ వెళ్లలేదని, కేవలం సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగించేందుకు పరిమిత స్థాయిలో చర్చలు జరిపారని దౌత్యవర్గాలు తెలిపాయి.
 
కాగా, రెండు దేశాల ఉన్నతాధికారులతో చర్చలు శనివారం జరుగుతాయి. ఆర్టికల్‌ 370 నిర్వీర్యం తరువాత భారత్‌ చైనా మధ్య నెలకొన్న అభిప్రాయభేదాల పరిష్కారానికి మోదీ ఈ సమావేశంలో కూడా తన వ్యక్తిగత స్థాయిలో ప్రయత్నించవచ్చని వినిపిస్తోంది.

కశ్మీర్‌పై తాము తీసుకున్న నిర్ణయం వల్ల సరిహద్దుల్లో మార్పేమీ ఉండబోదని మోదీ జిన్‌పింగ్‌కు వివరిస్తారు. దీనితో పాటు దీర్ఘకాలంగా చైనాతో ఉన్న సరిహద్దు సమస్యపైన కూడా కీలక చర్చ జరగవచ్చని, డోక్లాం ప్రతిష్ఠంభన లాంటివి మళ్లీ తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది.

అమెరికా-చైనా మధ్య సాగుతున్న వాణిజ్యయుద్ధాన్ని సానుకూలంగా మల్చుకునేందుకు మోదీ భారతీయ మార్కెట్‌ను కొన్ని ఎంపిక చేసిన అంశాల్లో చైనీయులకు తెరిచే ప్రతిపాదనలు చేయవచ్చనీ కూడా దౌత్యవర్గాలు తెలిపాయి. చైనా- పాకిస్తాన్‌ మైత్రిని దృష్టిలో ఉంచుకుని భారత్‌ దౌత్యవ్యూహాన్ని పకడ్బందీగా సిద్ధం చేసుకుంది.
 
విందులో ఆంధ్రా బిర్యానీ
మోదీ-జిన్‌పింగ్‌ల విందులో దక్షిణాదికి చెందిన శాకాహార, మాంసాహార వంటకాలనే వడ్డించారు. వాటిలో ఆంధ్రా బిర్యానీ కూడా ఉంది. తమిళనాడు స్పెషల్‌ సాంబారు, తక్కాలి (టమాటా) రసం, తంజావూరు కోడి కూర, కేరళ మలబార్‌ రుచులు, బీట్‌రూట్‌ గోంగూర పచ్చడి, చింతపండు-బెల్లంతో తయారుచేసిన కూర, సముద్రపు చేపల కూర, కొబ్బరి పాల పాయసం, బ్లాక్‌ రైస్‌తో చేసిన హల్వా, ముక్కని ఐస్‌క్రీమ్‌ వంటివి ఉన్నాయి.

అనంతరం రాత్రి 9.30 గంటలకు జిన్‌పింగ్‌ తిరిగి చెన్నైలోని ఐటీసీ గ్రాండ్‌ చోళాకి వెళ్లారు. మోదీ మహాబలిపురంలోని తాజ్‌ ఫిషర్‌మాన్‌ కోవ్‌ రిసార్టులోనే రాత్రి బస చేశారు.