శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (08:56 IST)

మోదీతో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

ఏపీ-తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్ రేపు ఢిల్లీకి పయనమవుతుండగా ఎల్లుండి ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.

ఇక అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎంఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రధానికి వివరించనున్న సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులుపై కూడా విజ్ఞప్తి చేసి రైతు భరోసా పథకానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు.
 
చాలా కాలం తర్వాత కేసీఆర్‌...
మోదీని కేసీఆర్‌ 2018 డిసెంబరులో చివరి సారిగా కలిశారు. మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత ఇప్పటి దాకా కలవలేదు. ఈ ఏడాది మే నెలలో జరిగిన మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా కేసీఆర్‌ హాజరుకాలేక పోయారు.

నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికి, నక్సల్‌ సమస్యపై హోంమంత్రి అమిత్‌ షా ఏర్పాటు చేసిన సమావేశానికీ కేసీఆర్‌ వెళ్లలేదు. రాష్ట్రంలో బీజేపీ- టీఆర్‌ఎస్‌ ఉప్పు-నిప్పుగా మారిన దశలో దాదాపు 10 నెలల తర్వాత ఇద్దరి భేటీ జరగబోతుంది.
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని మోదీని కలుస్తారు. ఈ భేటీలో గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది.

శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపుపై ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ ఇప్పటికే రెండుసార్లు చర్చించిన విషయం తెలిసిందే. ఈ బృహత్తర ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు ఎంతో మేలు చేస్తుందని, దీనికి కేంద్ర సహకారం అవసరమని కేసీఆర్‌ ప్రధానికి వివరించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పార్లమెంటు పరిశీలనలో ఉన్న డ్యామ్‌ సేఫ్టీ బిల్లు, నదీ జలాల యాజమాన్య బిల్లు వచ్చే నెలలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఆమోదంపొందితే నదీజలాలతో పాటు దేశంలోని ఆనకట్టలన్నీ కేంద్రం పరిధిలోకి వస్తాయి. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే మోదీ సహకారం కోరేందుకు కేసీఆర్‌ ఢిల్లీ వస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
 
కృష్ణా నదిలో ఎప్పుడో కానీ వరదలు రావడం లేదని, దాంతో నికర జలాలు తెలంగాణకు దక్కడం లేదని, వరద జలాలపైనే ఆధారపడి రెండు రాష్ట్రాల్లో చాలా ప్రాజెక్టులున్నాయని కేసీఆర్‌.. మోదీకి వివరించే అవకాశాలున్నాయి. గోదావరి జలాలతోకృష్ణా నీటిని అనుసంధానిస్తే తప్ప తెలంగాణలో పలుప్రాంతాలకు నీరొచ్చే అవకాశం లేదని, ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించనున్నారు.

ఈ ప్రాజెక్టుకు రూ.60-70 వేల కోట్ల ఖర్చవుతుందని, కేంద్రం కూడా కొంత భరిస్తే ఎంతో మేలు జరుగుతుందని మోదీకి చెప్పనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల అవసరాలు తీరిన తర్వాత మహానది, కావేరీ బేసిన్లకు కూడా నీటిని మళ్లించే అవకాశం ఉంటుందని ఆయన వివరించనున్నారు.

తెలంగాణ 3, ఏపీ రెండు ప్రతిపాదనలు సమర్పించామని, వీటిపై త్వరలో తుది నిర్ణయానికి రానున్నామని కేసీఆర్‌ చెప్పనున్నారు. తెలంగాణలో ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయడంతో వాటిని కూడా చేర్చి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరనున్నారు.

కాగా.. శనివారం ఏపీ సీఎం జగన్‌ కూడా ప్రధాని మోదీని కలవనున్నారు. ఆయన కూడా నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధలు, ఆర్థిక సహకారం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.
 
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ను కుదించాల్సి వచ్చిందని, కేంద్రం ఆదుకుంటే తప్ప నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టలేమని కూడా కేసీఆర్‌ ప్రధానికి చెప్పనున్నారు. విభజన చట్టంలో అమ లు చేయాల్సిన అంశాలు, జోనల్‌ వ్యవస్థలో మార్పులు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలపైనా వినతిపత్రం సమర్పించనున్నారు.

కాగా.. 2018 డిసెంబరులో మోదీని కలిసిన కేసీఆర్‌ ఈ ఏడాది మేలో జరిగిన ఆయన ప్ర మాణ స్వీకారానికి హాజరవలేకపోయారు. నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికీ వెళ్లలేదు. కేంద్రంతో భేదాభిప్రాయా లు వచ్చాయన్న ప్రచారం కూడా జరిగింది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు మోదీ దృష్టికి వెళ్లాయి. వీటన్నిటి నేపథ్యంలో 10 నెలల తర్వాత కేసీఆర్‌ ప్రధాని మోదీని కలుస్తుండడంతో వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.